మోర్తాడ్‌లో భారీ అగ్నిప్రమాదం

మోర్తాడ్‌లో భారీ అగ్నిప్రమాదం

  • ఆరుగురు రైతుల ఆశలు బుగ్గిపాలు​
  • లక్షలాది రూపాయల ఆస్తి నష్టం…
  • కన్నీరుమున్నీరవుతున్న బాధితులు

మోర్తాడ్/భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.మండల కేంద్రంలోని తక్కురి వాడ శివార్లలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు రైతులకు చెందిన వ్యవసాయ పాకలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.ఈ ఘటన తో బాధితులకు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది.​స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం..తక్కురి వాడ శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్న పాకల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఎండల తీవ్రతకు మంటలు క్షణాల్లో వ్యాపించి, పక్కపక్కనే ఉన్న ఆరు పాకలను చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో రైతులు తక్కూరి సంతోష్, తక్కురి శ్రవణ్, తక్కురి నడిపి అశోక్, పుప్పాల రాజవిట్టల్, పుప్పాల రవి, పుప్పాల సంతోష్‌లకు చెందిన పాకలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పాకల్లో నిల్వ ఉంచిన విలువైన సామాగ్రి అగ్నికి ఆహుతైంది. ​వ్యవసాయానికి ఉపయోగించే డ్రిప్ పరికరాలు, పైపులు.​ఖరీదైన ట్రాక్టర్ సామాగ్రి. ​ముందు జాగ్రత్తగా నిల్వ చేసుకున్న పశుగ్రాసం (గడ్డి వాములు).​రానున్న వేసవి, వర్షాకాలం కోసం ఎంతో కష్టపడి దాచుకున్న గడ్డి వాములు కళ్ల ముందే బూడిద కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.

సుమారు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని బాధితులు వాపోతున్నారు.​సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, పాకల్లోని సామాగ్రి అంతాకాలి బూడిదైందని స్థానికులు తెలిపారు.కష్టపడి పండించిన పంటను, కొనుగోలు చేసిన సామాగ్రిని అగ్నిదేవుడు పొట్టన పెట్టుకున్నాడు. అప్పులు చేసి కొన్న సామాగ్రి పోవడంతో మేము దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో సర్వే చేసి మమ్మల్ని ఆదుకోవాలి” అని బాధితులు వేడుకుంటున్నారు.