మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ప్రజలతో ముఖాముఖి
వినతులు స్వీకరించిన మంత్రి తుమ్మల
గాంధీ భవన్‌కు భారీగా తరలివచ్చిన ప్రజలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహిస్తున్న ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజల వినతులు, ఫిర్యాదులు, సమస్యలను నేరుగా స్వీకరిస్తున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు గత కొన్ని నెలలుగా ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా నిర్వహిస్తోంది. ప్రజలకు తమ సమస్యలను నేరుగా ప్రభుత్వ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పించడం, సంబంధిత శాఖల ద్వారా వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై భూ సమస్యలు, వ్యవసాయం, రెవెన్యూ, సంక్షేమ పథకాలు, ఇతర పరిపాలనా అంశాలకు సంబంధించిన వినతులను మంత్రికి అందజేశారు. ఆయా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలన అందించాలనే లక్ష్యంతోనే ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని కొనసాగిస్తోందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
