కారుపై విరిగిపడ్డ చెట్టు.. తృటిలో తప్పిన ప్రమాదం

ఏకధాటి వర్షాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన.. రెండు గంటలపాటు విద్యుత్ అంతరాయం

సదాశివనగర్, ఆంధ్రప్రభ: సదాశివనగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో కారుపై చెట్టు విరిగి పడడంతో తృటిలో ప్రమాదం తప్పింది. గత రెండు రోజులుగా మండలంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

వర్షాల ప్రభావంతో వంగిపోయిన భారీ వృక్షం వైద్యాధికారి డా. ఆస్మా అఫ్సిన్ కారుతో పాటు విద్యుత్ తీగలపై పడిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతినడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన గేటు కూడా ధ్వంసమైంది. చెట్టు విద్యుత్ తీగలపై పడటంతో సుమారు రెండు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ లైన్‌మన్ దడిగే లింగం, ఉప సర్పంచ్ ప్రవీణ్, నాయకులు వంకాయల రవి, వార్డు సభ్యులు సాగర్, శ్రీనివాస్, నవీన్, రాజయ్య, గ్రామ కార్యదర్శి ప్రశాంత్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని చెట్టును తొలగించి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చారు.