భట్టుపల్లిలో ప్రభుత్వ భూమిని పరిశీలించిన కలెక్టర్
హనుమకొండ, ఆంధ్రప్రభ: కాజీపేట మండలం భట్టుపల్లి గ్రామ పరిధిలో గతంలో స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించిన ప్రభుత్వ భూమిని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ భూముల రక్షణ, వాటి వివరాలపై స్పష్టత అత్యంత ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
భూమికి సంబంధించిన పూర్తి వివరాలను తహసీల్దార్ రాజును అడిగి తెలుసుకున్న కలెక్టర్, కేటాయింపుకు సంబంధించిన రికార్డులు, మ్యాపులను పరిశీలించి వాటిలో నమోదైన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో కలిసి భూమి హద్దులను ప్రత్యక్షంగా పరిశీలించి, భూ రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులు ఒకే విధంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వ భూముల రక్షణ, సక్రమ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఈ పరిశీలనలో సర్వేయర్ స్టాలిన్, ఆర్‌ఐ కృష్ణ, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
