Ganja | 38 కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని కోర్టు అనుమతితో ధ్వంసం చేసిన పోలీసులు
Ganja | కరీంనగర్ క్రైం, ఆంధ్రప్రభ: గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు కరీంనగర్ పోలీసులు మరోసారి కఠిన చర్యలు చేపట్టారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో స్వాధీనం చేసుకున్న 63 కిలోల 621 గ్రాముల గంజాయి, ఒక గంజాయి మొక్కను బుధవారం దగ్ధం చేశారు.
మానకొండూరు మండలం ఈదులగట్టెపల్లి గ్రామంలోని వెంకటరమణ ఇన్సినిరేటర్‌లో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సమక్షంలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహించారు.

కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 38 కేసులకు సంబంధించిన గంజాయిని కోర్టు అనుమతితో నిబంధనల ప్రకారం ధ్వంసం చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాస్ జి, వెంకటస్వామి, ఇన్‌స్పెక్టర్లు రఫీక్, శ్రీలత, ఆర్‌ఐలు రజినీకాంత్, శ్రీధర్ రెడ్డి, వెంకటరమణ ఇన్సినిరేటర్ ప్లాంట్‌కు చెందిన తిరుపతి, ప్రభాకర్ రెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు.

