Kandula Durgesh |బౌద్ధ పర్యాటకానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొస్తాం
ఉండ్రాజవరం, ఆంధ్రప్రభ: పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించిన “మైత్రేయ బుద్ధ విహార్” ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌతమ బుద్ధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, బుద్ధుని బోధనలు ప్రపంచానికి శాశ్వత మార్గదర్శకాలని పేర్కొన్నారు.
శాంతి, సహనం, అహింస, మైత్రి వంటి బౌద్ధ విలువలు నేటి సమాజానికి అత్యంత అవసరమని మంత్రి అన్నారు. “ద్వేషాన్ని ప్రేమతోనే జయించాలి” అనే భగవాన్ బుద్ధుని సందేశం ప్రతి మనిషి జీవితానికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్‌ను బౌద్ధ పర్యాటకానికి ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. తొట్లకొండ, బావికొండ, ఆదుర్రు, ఉండ్రాజవరం, అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల వంటి ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను అనుసంధానిస్తూ ‘బుద్ధిస్ట్ సర్క్యూట్’ ఏర్పాటు కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో కృషి చేస్తున్నామని వెల్లడించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తూ, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

