సింగరేణి ఉనికికే ముప్పు..
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి: కవిత
సింగరేణిపై కుట్ర జరుగుతోంది: కవిత
జెన్‌కోను రంగంలోకి దింపడంపై ప్రశ్నలు
బొగ్గు బ్లాకుల వేలం నిలిపివేయాలి
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణకు తలమానికమైన సింగరేణి కాలరీస్ సంస్థ అస్తిత్వానికే ముప్పు వాటిల్లేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సింగరేణి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని విమర్శించారు.
మణుగూరు ప్రాంతంలోని పీకేవోసీపీ బొగ్గు బ్లాక్‌ను వేలం వేయకుండా నేరుగా సింగరేణికి కేటాయించాలని పలుమార్లు కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని కవిత పేర్కొన్నారు. అయినప్పటికీ ఆ బొగ్గు బ్లాక్‌ను వేలానికి పెట్టడం ద్వారా సింగరేణి ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
జెన్‌కో పాత్రపై అనుమానాలు
సింగరేణి వేలంలో పాల్గొంటుందని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు తెలంగాణ జెన్‌కోను కూడా తెర వెనుక నుంచి వేలంలోకి దింపే ప్రయత్నాలు చేస్తోందని కవిత ఆరోపించారు. బొగ్గు తవ్వకాల్లో శతాబ్దానికి పైగా అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు పోటీగా, గనుల నిర్వహణలో అనుభవం లేని జెన్‌కోను బరిలోకి దించడం వెనుక ఉద్దేశం ఏమిటో ముఖ్యమంత్రి ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రైవేటీకరణ కుట్ర?
జెన్‌కో ద్వారా బొగ్గు బ్లాకులను దక్కించుకుని, అనంతరం అనుభవం లేదనే కారణంతో వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతోందని కవిత ఆరోపించారు. ఈ పరిణామాలు సింగరేణి సంస్థతో పాటు వేలాది మంది కార్మికుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని అన్నారు.
కిషన్‌రెడ్డికి కవిత విజ్ఞప్తి
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిజంగా సింగరేణి అభివృద్ధిని కోరుకుంటే బొగ్గు బ్లాకులను వేలం ద్వారా కాకుండా నేరుగా సింగరేణి సంస్థకే కేటాయించాలని కవిత డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జెన్‌కోను వేలం ప్రక్రియ నుంచి తప్పించాలని కోరారు.
