గోరక్షణ పేరుతో చట్టాలు ఉల్లగించొద్దు

గోరక్షణ పేరుతో చట్టాలు ఉల్లగించొద్దు

-వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్

వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ: గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలకో చట్టాలను అతిక్రమించవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. మూగ జీవాల అక్రమ రవాణాకు సంబంధించిన నిబంధనలు, చట్టపరమైన అంశాలపై వరంగల్ కమిషనరేట్ పరిధిలోని గో రక్షణ కమిటీలతో వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో ముందుగా మూగ జీవాల అక్రమ రవాణా నియంత్రణకై తీసుకోవాల్సిన చర్యలపై గో రక్షణ సమితి సభ్యులను పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అడిగి తెలుసు కున్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ వరంగల్ కమిషనరేట్ పరిధిలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు గాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిరంతం వాహన తనీఖీలు నిర్వహించే చర్యలు తీసుకుంటామన్నారు.

ఇందు కోసమని ప్రత్యేకంగా పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించడం జరిగిందని పేర్కొన్నారు. అదే విధంగా గోవుల అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా సమాచారం వుంటే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలి కాని గోవులను రక్షించాలనే క్రమంలో గో రక్షణ కమిటీ సభ్యులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. ముఖ్యంగా అక్రమంగా గోవుల తరలిస్తున్న వాహనాలను అడ్డుకునేందుకు రక్షణ కమిటీ సభ్యులు వాహనాలపై రవాణా చేస్తున్న వాహనాన్ని వెంబడిస్తూ వేగంగా వాహనాలను నడపటం చాలా ప్రమాదకరమని గుర్తు చేశారు.

అలాగే అక్రమంగా మూగ జీవాలను తరలిస్తున్న వాహనాలను అడ్డుకునే సమయంలో నిందితులు దాడులకు పాల్పడే అవకాశాలతో పాటు శాంతి భద్రతలు సమస్యలు రావచ్చని ఎత్తి చూపారు. అదీగాక సంరక్షణ చేసే క్రమంలో మీరు కూడా ప్రమాదంలో పడే అవకాశాలు వున్నాయన్నారు. ఇకపై స్థానికంగా వున్న గో రక్షణ కమిటీ సభ్యుల ఫోన్ నంబర్లను స్థానిక పోలీసులతో షేర్ చేసుకోవడం ద్వారా నకలీ ఫోన్ కాల్స్‌ను కట్టడి చేయవచ్చనన్నారు. దీని ద్వారా త్వరితగతిన గోవులను రక్షించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.

మూగ జీవాలను అక్రమంగా తరలించే వారిని పట్టుకోవడం పోలీసుల బాధ్యతని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గుర్తు చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తెసుకొంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ భరోసా కల్పించారు. ఈ సమావేశంలో డిసిపిలు అంకిత్‌కుమార్, రాజమహేంద్ర నాయక్, దార కవిత, ట్రైనీ ఐపిఎస్ మనిషా నేహ్రా,ఏసిపిలు డాక్టర్ మూల జితేందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, భీంశర్మ, సతీస్‌బాబు, రవీందర్ రెడ్డితో పాటు ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు, గో రక్షణ, భజరంగ్, విశ్వహిందు పరిషత్‌కు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply