Makthal | అధ్వాన రోడ్ల‌తో అవ‌స్థ‌లు

Makthal | అధ్వాన రోడ్ల‌తో అవ‌స్థ‌లు

ప‌దేళ్లుగా మార‌ని రోడ్డు దుస్థితి


Maktal | మక్తల్ (నారాయ‌ణ‌పేట‌ జిల్లా), ఆంధ్ర‌ప్ర‌భ : ర‌హ‌దారులు అధ్వానంగా ఉండ‌డంతో వాహ‌న‌దారులు ఇబ్బందులు ప‌డుతున్నారు. మక్తల్ (Maktal) నుండి జిల్లా కేంద్ర‌మైన నారాయ‌ణ‌పేట (Narayanpet) వ‌ర‌కూ ఉన్న రోడ్డంతా గుంత‌ల‌మ‌యంగా మారింది. ప‌దేళ్లుగా బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలోనూ, ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలోనూ ఈ రోడ్డు దుస్థితి మార‌లేద‌ని ప‌లు గ్రామాల ప్ర‌జ‌లు ఆవేద‌న చెందుతున్నారు.

మక్తల్ పట్టణం 167 వ జాతీయ రహదారి నుంచి నారాయణపేట క్రాస్ రోడ్ వ‌ర‌కూ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా ఉంది. ఏ మాత్రం వ‌ర్షం ప‌డినా గుంత‌ల్లో నీరు చేరిపోవడంతో వాహ‌న రాక‌పోక‌ల‌కు ఇబ్బందులు క‌లుగుతున్నాయి. అలాగే వాహ‌న రాక‌పోక‌ల దుమ్ముధూళితో ఆ ప్రాంతంలోని వ్యాపారులు (Traders), బ్యాంకు ఖాతాదారులు కూడా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. మక్తల్ నుండి నారాయణపేటకు కేవలం 30 కిలోమీటర్ల దూరం. ముప్ప‌యి కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణం మూడు గంట‌లు ప‌ట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌సరం లేదు. గ‌ర్భిణుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించాలంటే కుటుంబ స‌భ్యులు అనేక అవ‌స్థ‌లు పడుతున్నారు.

మక్తల్ పట్టణం నుంచి తిప్రారాస్ పల్లి వరకు రోడ్డులో అనేక చోట్ల పెద్ద‌పెద్ద గుంత‌లు ఉన్నాయి. ఈ రోడ్డులో ప్ర‌యాణ‌మంటే డ్రైవ‌ర్లు (Drivers) హ‌డ‌లిపోతున్నారు. వాహ‌నాల్లో కూర్చున్న ప్ర‌యాణికుల ఇక్క‌ట్లు అంతా ఇంతా కాదు. ప్ర‌ధానంగా గ‌ర్భిణుల ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయం.

బిఆర్ఎస్ పాలన (BRS rule) లో మక్తల్ నుండి నారాయణపేట రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయినప్పటికీ టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. ఏడాది క్రితం కూడా నిధులు మంజూరైనట్లు వార్తలు వచ్చినప్పటికీ టెండర్లు కాకపోవడంతో అలాగే కొనసాగింది. మక్తల్ నుండి నారాయణపేట రోడ్డు కొత్తగా నిర్మించేందుకు రూ 80 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఆర్ అండ్ బి అధికారులు తెలిపారు. టెండర్ల దశలో ఉన్నట్లు వారు చెప్పారు.

Leave a Reply