అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త ఇళ్ల మంజూరు

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహరహిత కుటుంబాల గుర్తింపు: హౌసింగ్ ఏఈ అశ్వత్థనారాయణ

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త ఇళ్లను మంజూరు చేస్తామని ఉరవకొండ హౌసింగ్ ఏఈ అశ్వత్థనారాయణ తెలిపారు.

సోమవారం ఉరవకొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహాల మంజూరు ప్రక్రియలో భాగంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా హౌసింగ్ ఏఈ అశ్వత్థనారాయణ మాట్లాడుతూ.. గృహరహితులు, కచ్చా ఇళ్లలో నివసిస్తున్న అర్హులైన కుటుంబాలను గుర్తించి ఇంటి మంజూరుకు ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. గ్రామానికి సంబంధించిన జాబితాలో అనర్హులను తొలగించి, అర్హులైన లబ్ధిదారుల వివరాలను గ్రామసభలో చదివి వినిపించినట్లు చెప్పారు.

ఇప్పటికే పక్కా ఇల్లు కలిగి ఉన్నవారు, గతంలో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు కొత్త ఇంటి మంజూరుకు అనర్హులుగా పరిగణించబడతారని స్పష్టం చేశారు. కొత్తగా ఇల్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి షేక్ మహమ్మద్ షఫీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.