GOOD NEWS| గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త

  • అంతర్ జిల్లా బదిలీల కొత్త మార్గదర్శకాలు విడుదల

GOOD NEWS| చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఇంటర్‌జిల్లా బదిలీలపై పెద్ద ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. భర్త, భార్యల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జీవో రూపంలో విడుదల చేసింది. ఈ బదిలీలు పూర్తిగా ఉద్యోగి అభ్యర్థనపై మాత్రమే చేపడతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంటర్‌జిల్లా బదిలీ ప్రక్రియ ఇక మీదట పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. భర్త లేదా భార్యల్లో ఎవరైనా ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండాలి. ఉద్యోగి భాగస్వామి ప్రైవేట్ రంగంలో పనిచేస్తే స్పౌజ్ గ్రౌండ్స్ వర్తించబోదని స్పష్టంగా పేర్కొంది. బదిలీ యూనిట్ ప్రస్తుత జిల్లాలుగా కాకుండా పాత జిల్లా పరిమితుల ఆధారంగానే కొనసాగుతుందని తెలిపింది. ఖాళీల వివరాలను సంబంధిత శాఖలు ముందుగానే స్పష్టంగా ప్రకటిస్తాయి. శాఖాపరంగా ఎటువంటి శిక్షార్హ కేసులు, ఎసీబీ విచారణలు లేదా ఇతర అనుచిత చర్యల కేసులు ఉద్యోగిపై పెండింగ్‌లో ఉండకూడదు.

అంతేకాకుండా నో డ్యూస్ ధృవీకరణ పత్రం తప్పనిసరి. బదిలీ పరిశీలన, ఎంపిక మొత్తం మెరిట్ ర్యాంక్ ఆధారంగానే జరుగుతుంది. దరఖాస్తుల కోసం ముఖ్య పత్రాల్లో వివాహ ధృవీకరణ పత్రం, భాగస్వామి ప్రభుత్వ సేవలో ఉన్నట్లు ఉద్యోగ ధృవీకరణ, ఉద్యోగ గుర్తింపు సంఖ్య తప్పనిసరిగా జత చేయాలి. బదిలీ నియమాలలో ఇతర ముఖ్య అంశాలు కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఖాళీ ఉన్న చోట్లకే బదిలీ చేస్తారు. కొత్త జిల్లాలో చేరిన తరువాత ఆ జిల్లాలో చివరి ర్యాంక్‌గా ఉద్యోగిని చేర్చుతారు. ఒకే ర్యాంక్ వచ్చిన సందర్భాల్లో మొదట సీనియారిటీ, అది సమానం అయితే పుట్టిన తేదీ ఆధారంగా ప్రాధాన్యత ఇస్తారు. బదిలీ ప్రక్రియలో మొదట ఆన్‌లైన్ అప్లికేషన్ స్వీకరించి తాత్కాలిక సీనియారిటీ జాబితా విడుదల చేస్తారు. అందులో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితాను ప్రకటిస్తారు. అనంతరం శాఖా కార్యదర్శులు ఇంటర్‌జిల్లా బదిలీ ఆదేశాలు జారీ చేస్తారు.

కొత్త జిల్లాకు బదిలీ అయిన ఉద్యోగిని సంబంధిత మండలం లేదా పట్టణ స్థానిక సంస్థకు కేటాయిస్తారు. అనంతరం నిర్వహించే కౌన్సిలింగ్‌లో వార్డు సచివాలయానికి కేటాయింపు ఉంటుంది. ఈ బదిలీలు పూర్తిగా ఉద్యోగి అభ్యర్థనపై జరిగే స్వయంకృత బదిలీలు కావున ప్రయాణభత్యం లేదా ఇతర భత్యాలు చెల్లించబడవని ప్రభుత్వం తెలిపింది. ఇంటర్‌జిల్లా బదిలీలకు సంబంధించి మొత్తం ప్రక్రియ నవంబర్ 30, 2025 లోపు పూర్తిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కొత్త జీవో విడుదలతో ఎన్నో కుటుంబ సమస్యలు తగ్గనున్నాయని, భర్త, భార్యలు ఒకే జిల్లాలో పనిచేసే అవకాశం లభించడంతో వేలాది మంది సచివాలయ ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.