పుష్కరాలకు ముందే గోదావరి ప్రక్షాళన..!

పుష్కరాలకు ముందే గోదావరి ప్రక్షాళన..!
కాలుష్య రహిత గోదావరే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యం: ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
తిరుపతి టౌన్, ఆంధ్రప్రభ : గోదావరి నదిని పూర్తిగా కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. పంచాయతీలు, పరిశ్రమలు, ఆక్వా రంగం నుంచి వెలువడే వ్యర్థాలు గోదావరిలో కలవకుండా చర్యలు చేపట్టేందుకు రూ.100 కోట్లు కేటాయించారని వెల్లడించారు.
ఆదివారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2027 జూన్‌లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర కార్యాచరణ అమలు చేస్తున్నట్లు చెప్పారు.
గోదావరి పరివాహక ప్రాంతంలోని 262 పంచాయతీల నుంచి విడుదలయ్యే మురుగునీరు నదిలో కలవకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే మున్సిపాలిటీల వ్యర్థాలు, పారిశ్రామిక మరియు ఆక్వా వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతాలను పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికారులు గుర్తించారని చెప్పారు.
ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారని తెలిపారు. ఆర్టీజీఎస్ తరహాలో ఈ కంట్రోల్ రూమ్‌లు పనిచేసే విధంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ పేరుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపడుతున్న కార్యక్రమాలు తప్పకుండా ఫలితాలు ఇస్తాయని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా గోదావరి ప్రక్షాళన కార్యక్రమానికి పూర్తి మద్దతు అందిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ మీడియా సమావేశంలో జనసేన నాయకులు రాజారెడ్డి, ఆర్కాట్ కృష్ణప్రసాద్, ఆముదాల వెంకటేష్, రాజేష్ ఆచారి, ప్రభాకర్ రెడ్డి, జీవకోన సుధా, మణి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
