గుడివాడకు ఐకానిక్ షాదీఖానా…సీఎం చంద్రబాబు హామీ
- ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చొరవతో మైనార్టీల చిరకాల సమస్యకు పరిష్కారం
గుడివాడ, ఆంధ్రప్రభ : సీఎం చంద్రబాబు సహకారంతో గుడివాడ మైనార్టీ సోదరుల సుదీర్ఘ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. కేవలం మైనార్టీ సోదరులకే కాక, పేదలందరికీ ఉపయోగపడేలా ఐకానిక్ షాదీఖానా భవనం గుడివాడ ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు ఆయన చెప్పారు.
ఇటీవల ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు దృష్టికి గుడివాడ షాదీఖానా సమస్యను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సభా వేదికపైనే గుడివాడలో షాదీఖానా నిర్మాణానికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారు.

సీఎం ఇచ్చిన హామీ మేరకు ఆదివారం ప్రజా వేదిక కార్యాలయంలో మైనార్టీ వెల్ఫేర్,ఇంజనీరింగ్ శాఖ అధికారులు, మరియు ప్లానింగ్ నిపుణులతో… ఎమ్మెల్యే రాము ప్రత్యేక సమావేశం నిర్వహించారు. షాదీఖానా నిర్మాణానికి ఉన్న అవాంతరాలు, నూతన డిజైన్, అంచనాల రూపకల్పనపై… విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మైనార్టీ నేతల నుండి కూడా భవన నిర్మాణానికి సంబంధించి అభిప్రాయాలను ఎమ్మెల్యే స్వీకరించారు.
గతంలో నిర్మాణం ప్రారంభమై కొన్ని కారణాలతో అసంపూర్తిగా నిలిచిపోయిన భవనానికి కొనసాగింపుగా నూతన ప్రతిపాదనలు, డిజైన్ రూపొందించాలని అధికారులకు, ఎమ్మెల్యే రాము సూచనలు చేశారు. సీఎం చంద్రబాబుకు గుర్తుగా, రాబోయే తరాలకు ఉపయోగకరంగా ఉండేలా ఐకానిక్ భవనం నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భవన నిర్మాణంపై ఉర్దూ అకాడమీ చైర్మన్ మహ్మద్ ఫరూఖ్ షుబ్లి తో కూడా ఎమ్మెల్యే రాము ఫోన్ లో మాట్లాడి అభిప్రాయాలు పంచుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ, మైనార్టీ సోదరుల చిరకాల కోరిక అయిన షాదీఖానా కోసం మంచి భవనం నిర్మితమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కన్సల్టెన్సీ సంస్థ ద్వారా అత్యాధునిక డిజైన్ రూపకల్పన చేస్తున్నామని, ఇది మైనార్టీ సోదరులకు సీఎం చంద్రబాబు ఇచ్చే కానుకగా నిలుస్తుందని అన్నారు.
“ఇది కేవలం మైనార్టీ సోదరులకే కాకుండా, పేదవారు అందరికీ ఉపయోగపడేలా నూతన భవనం ఉంటుంది” అని ఎమ్మెల్యే తెలిపారు. “ఇన్నాళ్లు మైనార్టీ సోదరులు పడిన ఇబ్బందులకు చక్కటి భవనం ఏర్పడాలన్నదే నా లక్ష్యం” అని ఆయన పునరుద్ఘాటించారు.
ఉన్న నిర్మాణాన్ని తీసివేయకుండా, చక్కటి ఎలివేషన్ తో ఆధునికంగా భవనం నిర్మితమవుతుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని, మైనార్టీ సోదరులందరూ సహకరించాలని కోరారు. భవనంలో యువతకు ఉపయోగపడేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాము చెప్పారు.
ఈ సమావేశంలో ఉమ్మడి కృష్ణాజిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ రబ్బాని, ఏపీ ఎస్ డబ్ల్యూ సి చైర్మన్ రావి వెంకటేశ్వరరావు,APEWIDC AE రాజేష్,ప్లానింగ్ నిపుణుడు రామస్వామి, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, గుడివాడ టిడిపి అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య,సీనియర్ టిడిపి నాయకులు లింగం ప్రసాద్, చేకూరు జగన్ మోహన్ రావు,మైనార్టీ నాయకులు షేక్ ఇబ్రహీం, షేక్ సర్కార్, జానీ షరీఫ్, సయ్యద్ జబిన్, రబ్బానీ, షేక్ మౌలాలి, రషీద్ బేగ్,రఫీ, మోబిన్, మున్వర్, కరిముల్లా, అబ్దుల్లా భాష, మొహమ్మద్ రఫీ, జునైద్, పలువురు మైనార్టీ నాయకులు,మైనార్టీ వెల్ఫేర్ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
