Police-Pallenidra : జనంతో పోలీసన్న Andhra Prabha Police Story

Police-Pallenidra : జనంతో పోలీసన్న Andhra Prabha Police Story

  • పల్లెనిద్రతో ప్రజలకు భరోసా
  • అలిపిరి పరిధిలో అవగాహన
  • పోక్సో, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై విస్తృత ప్రచారం

( ఆంధ్రప్రభ, తిరుపతి)

Police-Pallenidra : ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు నేరాల నివారణపై అవగాహన కల్పించే లక్ష్యంతో తిరుపతి జిల్లా పోలీసు శాఖ “పల్లెనిద్ర” కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పోలీసు-ప్రజల మధ్య మరింత సాన్నిహిత్యం పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.


ఈ కార్యక్రమంలో భాగంగా అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామ ప్రజలతో సమావేశమైన పోలీసు అధికారులు వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల పాత్ర ఎంతో కీలకమని వివరించారు. గ్రామంలో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారం ఉంటే నేరాలను మరింత సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.

సమావేశంలో పోక్సో (POCSO) చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధితులకు అందుబాటులో ఉన్న పోలీసు సేవల గురించి వివరించారు. అదే విధంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించడం వంటి అంశాలపై ప్రజలకు సూచనలు చేశారు. ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాలను దృష్టిలో ఉంచుకుని అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, నకిలీ లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు.

Police-Pallenidra : ఎస్పీ ఏమన్నారంటే

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని అధికారులు సూచించారు. నేరాలు, అనుమానాస్పద ఘటనలు లేదా ఇతర అత్యవసర సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ప్రజల భద్రతే తిరుపతి జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని, మహిళలు, చిన్నారుల రక్షణతో పాటు నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు.