హోటల్స్, లాడ్జీల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి..

హోటల్స్, లాడ్జీల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి..

  • నకిలీ గుర్తింపు కార్డులతో అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాలు
  • క్షుణ్ణంగా తనిఖీ చేయకుంటే చర్యలు తప్పవు..
  • విస్తృతంగా నాకా బందీ, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు
  • కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం

కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : నగరంలో హోటల్స్, లాడ్జీల నిర్వాహకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఆదేశించారు. కరీంనగర్ నగరంలో ఇటీవల పీఎంజే జ్యువెలరీలో జరిగిన భారీ దోపిడీ ఉదంతాన్ని పురస్కరించుకుని సోమవారం కమిషనరేట్ పరిధిలోని హోటళ్లు, లాడ్జీల యజమానులు, నిర్వాహ వాకులతో అస్త్ర కన్వెన్షన్ హాల్లో పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆయుధాలతో కూడిన ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠా నకిలీ ఆధార్ కార్డులు, తప్పుడు ఫోన్ నంబర్లు, తప్పుడు చిరునామాలు ఇచ్చి నగరంలోని పలు హోటళ్లలో దాదాపు రెండు నెలలపాటు బస చేసి రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు.

ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతే ధ్యేయంగా పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా కఠినమైన మార్గదర్శకాలను జారీ చేస్తున్నామని తెలిపారు. హోటల్ లేదా లాడ్జీలలో రూములు కేటాయించే ముందు ప్రభుత్వ గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని, కేవలం ఆధార్ కార్డులను గుడ్డిగా నమ్మకుండా.. అందులోని ఫోటో, వయస్సు, చిరునామా అసలైనవా కాదా అని సరిచూసుకోవాలని, అవసరమైతే అదనపు గుర్తింపు కార్డులను అడగాలన్నారు. కస్టమర్లు ఇచ్చే మొ బైల్ నంబర్ పనిచేస్తుందో లేదో క్రాస్-చెక్ చేసుకోవాలని, సదరు వ్యక్తి పేరుపై ఉందో లేదో నిర్ధారించుకోవాలన్నారు.

విదేశీయులు వస్తే నిబంధనల ప్రకారం తక్షణమే సమాచారం అందించాలని, ప్రతి హోటల్లో హై- రెజల్యూషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, కనీసం 90 రోజుల ఫుటేజీని భద్రపరచాలన్నారు. గెస్ట్ రిజిస్టర్, ఐడీ ప్రూఫ్స్, వాహనాల వి వరాలు, చెక్- ఇన్, చెక్- అవుట్ సమయాలను డిజిటల్ రూపంలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. లగేజీ లేకుండా రూమ్ తీసుకునేవారు, ఆయుధాలు లేదా అనుమానాస్పద బ్యాగులతో వచ్చేవారు, సీసీ కెమెరాల ముందుకు రాకుండా తప్పించుకునే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. భారీ నగదు లావాదేవీలు చేసే వారి వివరాలను వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు చేరవేయాలన్నారు.

నిబంధనలు ఉల్లంఘించి, నిందితులకు ఆశ్రయం కల్పించినా లేదా పోలీసులు తనిఖీలకు సహకరించకపోయినా సదరు హోటల్ యాజమాన్యాలపై క్రిమినల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర నేరగాళ్ల కదలికలను అణచివేయడానికి కరీంనగర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత నిఘా, ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద పగలు, రాత్రి తేడా లేకుండా నాకా బందీ నిర్వ వాస్తున్నారన్నారు. నకిలీ నంబర్ ప్లేట్లు, అద్దె వాహనాలు, తప్పుడు పత్రాలతో తిరిగే వారిని నిశితంగా పరిశీలిస్తున్నారని, సమస్యాత్మక ప్రాంతాలు, శివారు కాలనీలలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారన్నారు. కొత్తగా అద్దెకు దిగిన వారు, అనుమానాస్పద వ్యక్తులు, పాత నేరస్థుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నామన్నారు.