ఏజెన్సీలో రెవిన్యూ అవినీతి లీలలు…?

పైసలిస్తేనే ఫైలు కదులుతుంది
ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్…
అధికారుల నిర్వహణపై రైతుల ఆగ్రహం

వాజేడు, ఆంధ్రప్రభ : ఏజెన్సీ ప్రాంతంలో రెవిన్యూ అవినీతి లీలలు కొనసాగుతున్నాయి ఇక్కడ ఏ పని కావాలన్నా పైసలిస్తేనే ఫైలు కదులుతుంది. ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసి ఇక్కడి అధికారులు రైతులను అందిన కాడికి దోచుకుంటున్నారనే సమాచారం కోడై కూస్తుంది. ఏ పని కావాలన్నా ఇక్కడ అధికారులకు ఎంతో కొంత ముడుపులు ముట్ట చెప్పాల్సిందే. ఏజెన్సీలో జరుగుతున్న రెవిన్యూ అవినీతి లీలలపై ప్రత్యేక కథనం…..

మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలంలో రెవిన్యూ కు సంబంధించిన ఏ పని కావాలన్నా ముడుపులు ముట్ట చెప్పక తప్పడం లేదని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసి ఇక్కడి రెవెన్యూ అధికారులు అడ్డంగా దోచుకుంటున్నారనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. పట్టాల మార్పిడి చేసుకునే లబ్ధిదారులకు రెవిన్యూ అధికారులు ముడుపులు మొట్ట చెప్తే తప్ప ఏ పని చేయడం లేదని వాపోతున్నారు. ఒకవైపు పాలక ప్రభుత్వం భూభారతి పేరుతోటి పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెబుతుంటే ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా అధికారుల వ్యవహారం కొనసాగుతుందనే ఆరోపణలు అత్యధికంగా వినిపిస్తున్నాయి. వారసత్వం పట్టాల మార్పిడికి కూడా ఎకరానికి పదివేల నుండి 20 వేల రూపాయల డిమాండ్ చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.

కంప్యూటర్ ఆపరేటర్ కానుంచి మొదలుకొని అసలు సిసలైన అధికారి వరకు ఈ మూడు పూల వ్యవహారం కొనసాగుతూనే ఉంది పైసలు ఎవరైతే ముందుగా చెల్లిస్తారో వారికి మాత్రమే వాజేడు రెవిన్యూ శాఖలో పని అవుతుంది . ఎవరైతే ముడుపులు చెల్లించరో వారి పనిని నెలల తరబడి పెండింగ్లో పెట్టి కార్యాలయం చుట్టూ తిప్పిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ముడుపులు ముట్ట చెప్పే వారికి ముందస్తుగా పనులవుతుంటే ముడుపులు అప్ప చెప్పలేని స్థితిలో ఉన్న ప్రజలు నానా ఇబ్బందులను ఎదుర్కొంటూ అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ పట్టాల మార్పిడి ముడుపుల విషయంలో తహసిల్దార్ కింది స్థాయి ఉద్యోగి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం ఆయన వారసత్వం పట్టాలే కాక అమ్ముడు కొనుగోలు పట్టాలకు సైతం ఒక రేటును ఫిక్స్ చేసి ముడుపులు ముట్ట చెప్పిన వారికి పని పూర్తి చేసి అప్పగిస్తున్నట్లు సమాచారం. ఇది తెలుసుకున్న కొంతమంది అర్ధరాత్రి వేళల్లో కూడా రెవిన్యూ కార్యాలయంలో దర్శనమిస్తూ పనులను పూర్తి చేసుకుంటున్నారు.

ఈ సందర్భంగా గత కొద్ది నెలలుగా కొనసాగుతుందని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం ప్రకారం గిరిజనేతర్ల మధ్య కొనుగోలు అమ్మకాలు జరుపకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ గిరిజనేతర్లు కొనుగోలు చేసిన భూములకు సైతం పట్టాలను మంజూరు చేస్తున్నట్లు తెలుస్తుంది. పైసలు ఇస్తే గాని పని కాదని తెలుసుకున్న కొంతమంది వ్యక్తులు నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరగలేక అధికారులు ముడుపులను ముట్ట చెప్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పట్టాల మార్పిడిలో కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు సైతం రెవిన్యూ అధికారులకు వత్తాసు పలుకుతూ ముడుపులు ముట్ట చెప్పండి ఏ పని కాదని లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి ఇకనైనా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి రెవిన్యూ అధికారుల పనితీరుపై తగు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు.