తెలంగాణ సంస్కృతికి బోనాలు ప్రతీక: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- వేములవాడలో వైభవంగా బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాల ఉత్సవాలు
- సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష
వేములవాడ, ఆంధ్రప్రభ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఆషాఢ మాస బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడలో రెడ్డి సంఘం, పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బద్ది పోచమ్మ అమ్మవారి బోనాల జాతరలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలోని వివిధ సంఘాలు ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అమ్మవారి కరుణాకటాక్షాలతో తెలంగాణలో సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే వేములవాడ రూపురేఖలు మారనున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రెడ్డి సంఘం, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, మున్నూరు కాపు సంఘం సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
