SIR | టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా కోల్పోవద్దు..
ఆగస్టు 3 వరకు ప్రక్రియపై పూర్తి దృష్టి పెట్టాలి
కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ చీఫ్ సూచన
SIR | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలకు సూచించారు. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. సర్ ప్రక్రియపై నిర్వహించిన జూమ్ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆగస్టు 3వ తేదీ వరకు సర్ పనులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పనిచేయాలని సూచించారు.
చిన్నపాటి నిర్లక్ష్యాన్ని కూడా సహించేది లేదని స్పష్టం చేసిన ఆయన.. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ప్రక్రియను వేగవంతం చేయాలని, బూత్ లెవల్ ఏజెంట్లు (BLA)కు అవసరమైన సహకారం అందించాలని కోరారు. గతంలో సర్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన నష్టాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎంత కష్టపడతామో అదే స్థాయిలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియలోనూ శ్రమించాలని నేతలకు పిలుపునిచ్చారు. సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు నాయకులు తమ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండి పర్యవేక్షించాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.
