వ్యక్తిగత విమర్శలు మానుకోండి..

  • లేదంటే అందరి బండారం బయటపెడతా: మల్లెల లక్ష్మణ్
  • బీఆర్ఎస్ నాయకుల అవినీతిపై ఆధారాలతో మాట్లాడేందుకు సిద్ధం
  • హుందా రాజకీయాలు చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడి సూచన

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మానుకుని హుందాగా వ్యవహరించాలని, లేనిపక్షంలో అందరి వ్యవహారాలను ఆధారాలతో ప్రజల ముందుకు తీసుకొస్తానని కాంగ్రెస్ పార్టీ భీమ్‌గల్ మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ హెచ్చరించారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ రెడ్డితో పాటు తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకుల తీరును తీవ్రంగా ఖండించారు.

బీఆర్ఎస్‌కు చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు చేసిన అవినీతి అంశాలపై ఆధారాలతో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసిన రెండో శ్రేణి నాయకులను ఎదగనీయకుండా అడ్డుకున్న చరిత్ర బీఆర్ఎస్ నాయకత్వానిదేనని ఆరోపించారు. తమ నాయకుడు ముత్యాల సునీల్ రెడ్డి మాత్రం అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, అవసరమైతే నిజాలు ప్రజల ముందుకు తీసుకొస్తానని స్పష్టం చేశారు.

సమావేశంలో మాజీ వార్డు సభ్యుడు కర్నె గంగయ్య, కౌన్సిలర్ సతీష్, వాక మహేష్ మాట్లాడుతూ భీమ్‌గల్ అభివృద్ధి, హుందా రాజకీయాల అవసరాన్ని ప్రస్తావించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు అంజుమ్, సంగ్యా నాయక్, కాంగ్రెస్ నాయకులు సేవాలాల్, చెప్పాల గణేష్, మంద గోవర్ధన్, తెడ్డు అశోక్, బర్ల మోహన్, మహేష్, అతిక్, జుబేర్ తదితరులు పాల్గొన్నారు.