Bonalu | కోటలో ఆధ్యాత్మిక సందడి

జగదాంబికా మహంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ..
భక్తుల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు

Bonalu | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా చారిత్రక గోల్కొండ కోటలో నిర్వహిస్తున్న శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో గోల్కొండకు చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు.

కోట ప్రాంగణం భక్తుల రాకతో సందడిగా మారింది. పోతురాజుల విన్యాసాలు, డప్పుల మోతలు, భక్తుల నినాదాలతో గోల్కొండ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ, ఆలయ ట్రస్ట్‌ కమిటీ, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, తాగునీటి సౌకర్యం, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.

బోనాల ఉత్సవాల్లో భాగంగా లంగర్‌హౌస్‌ నుంచి ప్రత్యేక ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించే సంప్రదాయం కొనసాగుతోంది. గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఆషాఢ మాస ఉత్సవాలు నగరవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ట్రాఫిక్‌, దర్శన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.