Previously in 2017 | జయశంకర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలి..
Previously in 2017 | జయశంకర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలి..
Previously in 2017 | హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రముఖ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్‌కు తగిన గౌరవం కల్పించేలా హైదరాబాద్‌లో ప్రభుత్వం అధికారికంగా ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేసిన మహోన్నత వ్యక్తి జయశంకర్ అని, తెలంగాణ అవసరాన్ని గ్రామగ్రామాన ప్రజలకు వివరించిన దార్శనికుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని కవిత పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని నిస్వార్థంగా వ్యాప్తి చేసిన జయశంకర్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా కాంస్య విగ్రహం ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని ఆమె అభిప్రాయపడ్డారు.
తెలంగాణ జాగృతి ఇప్పటికే రాష్ట్రంలోని నాలుగు జిల్లా కేంద్రాల్లో జయశంకర్ నిలువెత్తు విగ్రహాలను ఏర్పాటు చేసి ఆయనకు నివాళులర్పించిందని కవిత గుర్తు చేశారు. ఇదే అంశంపై గతంలో 2017లో కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ ఆశించిన స్పందన రాలేదన్నారు.
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ప్రస్తుతం ఏర్పాటు చేసిన యుద్ధ ట్యాంక్ సమీపంలో జయశంకర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. ప్రభుత్వం అనుమతిస్తే విగ్రహ ఏర్పాటుతో పాటు భవిష్యత్తులో ఆ ప్రాంత నిర్వహణ, హరితీకరణ బాధ్యతలను కూడా తెలంగాణ జాగృతి చేపడుతుందని తెలిపారు.
విగ్రహ నిర్మాణానికి అవసరమైన పూర్తి వ్యయాన్ని తమ సంస్థ భరిస్తుందని, ఇప్పటికే సిద్ధం చేసిన నమూనా రూపకల్పనలు, ప్రణాళిక పత్రాలను ప్రభుత్వానికి సమర్పించినట్లు కవిత పేర్కొన్నారు. జయశంకర్ జయంతి అయిన ఆగస్టు 6 నాటికి విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు.
మహనీయులను గౌరవించుకోవడం అంటే చరిత్రను గౌరవించుకోవడమేనని, తెలంగాణ సమాజానికి జయశంకర్ అందించిన సేవలను భావితరాలకు చేరవేయాల్సిన అవసరం ఉందని కవిత తన లేఖలో పేర్కొన్నారు.
