ఉమ్మడి ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే సుసంపన్నంగా నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. అలాగే జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కుల మతాలకతీతంగా విద్యార్థులకు విద్యను అందిస్తున్నామని చెప్పారు.
రెవెన్యూ శాఖ పటిష్టతకు చర్యలు
రెవెన్యూ శాఖను పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టామని, ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి పరిపాలన అధికారిని నియమిస్తున్నామని భట్టి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మన ఆడబిడ్డల ప్రయాణ ఖర్చులు ఆలోచించి వారి ప్రయాణ ఖర్చులు ఉచితం చేశామని గుర్తు చేశారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్న వారికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, నిరాశ్రయులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించిందన్నారు. రైతులకు రుణ మాఫీ చేసి రైతులు తిరిగి రుణ మాఫీ పొందడానికి మార్గం సుగమం చేశామన్నారు. ప్రస్తుత యాసంగికి బోనస్ చెల్లించనున్నామని చెప్పారు.
మద్దులపల్లిలో రూ.20 కోట్లతో మార్కెట్ యార్డ్
మద్దులపల్లిలో 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్ యార్డ్ నిర్మించుకుంటున్నామన్నారు. ఇందిరా మహిళ శక్తి కింద మహిళా మార్ట్, మహిళ క్యాంటీన్ లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్వయం సహాయక సభ్యులతో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. గురుకులాల్లో చదివే విద్యార్థుల కు 40 శాతం డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. వంద ఎంబీబిఎస్ సీట్ల సామర్థ్యం కలిగిన మెడికల్ కాలేజీలను రూ.130 కోట్లతో నిర్మించామన్నారు. రూ.20 కోట్ల నిధులతో రోడ్డు ప్రమాద ఘటనలో చికిత్స అందించేందుకు అత్యవసర విభాగాలు నిర్మించామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధులతో పాటు మైనార్టీ విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.
ఖమ్మం నగరం చుట్టూ రింగ్ రోడ్డు
ఖమ్మం నగరం చుట్టూ జాతీయ రహదారులు రానున్నాయి, రింగ్ రోడ్డుకు చర్యలు చేపట్టామని భట్టి చెప్పారు. మున్నేరు నది పై తీగల వంతెన నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. అన్ని గ్రామ పంచాయతీలలో వైకుంఠ ధామం నిర్మించామన్నారు. అక్రమంగా గనులు తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి, 825 కేసులు నమోదు చేసి కోటి 36 లక్షల జరిమాన విధించడం జరిగిందని తెలిపారు. కొత్తగా కల్లూరు పట్టణాన్ని మున్సిపాలిటీ గా ఏర్పాటు చేశామన్నారు. సర్దార్ పటేల్ స్టేడియం లో 8 కోట్ల 50 లక్షలతో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటు చేశామని, సీఎం కప్ పోటీలకు ఖమ్మం జిల్లా నుండి 382 మంది క్రీడాకారులు పాల్గొని 20 బంగారు పతకాలు, 12 వెండి, 15 కాంస్య పతకాలు సాధించారని అన్నారు. భూ తాపాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వన మహోత్సవం ప్రారంభించిందని, 2024-25 సంవత్సరానికి గాను 31 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో ఇప్పటికే 34 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని చెప్పారు.