Telangana | హుస్నాబాద్‌కు అరుదైన గౌరవం…
Telangana | హుస్నాబాద్‌కు అరుదైన గౌరవం…
- చెత్త నిర్వహణలో ఉత్తమ మున్సిపాలిటీగా రాష్ట్ర స్థాయి అవార్డు..
హుస్నాబాద్, ఆంధ్రప్రభ: చెత్త నిర్వహణలో విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు హుస్నాబాద్ మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయి “ఉత్తమ మున్సిపాలిటీ” అవార్డు లభించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB) నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, కమిషనర్ మల్లికార్జున్ ఈ అవార్డును అందుకున్నారు.
హుస్నాబాద్ మున్సిపాలిటీకి ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించడం పట్ల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, కమిషనర్ మల్లికార్జున్‌తో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, సమర్థవంతమైన చెత్త నిర్వహణలో హుస్నాబాద్ మున్సిపాలిటీ చేసిన కృషికి ఈ అవార్డు నిదర్శనమని పేర్కొన్నారు.
అదేవిధంగా టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ హుస్నాబాద్ మున్సిపాలిటీ ప్రతినిధులను, మంత్రి పొన్నం ప్రభాకర్‌ను అభినందించి సత్కరించారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, సమర్థవంతమైన చెత్త నిర్వహణలో హుస్నాబాద్ మున్సిపాలిటీ సాధించిన ఈ గుర్తింపు అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మున్సిపాలిటీ మరింత మెరుగైన సేవలు అందించాలని, పరిశుభ్రమైన పట్టణ నిర్మాణంలో కౌన్సిలర్లు, అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ అవార్డు హుస్నాబాద్ మున్సిపాలిటీకి మాత్రమే కాకుండా పట్టణ ప్రజలందరికీ గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు.
