క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా వివరాలను పరిశీలించిన కలెక్టర్

క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా వివరాలను పరిశీలించిన కలెక్టర్

సమగ్ర సవరణ ప్రక్రియ విజయవంతానికి పటిష్ట ఏర్పాట్లు

కంచికచర్ల, ఆంధ్రప్రభ : జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఆర్‌) సన్నద్ధత కార్యక్రమాలు జూన్ 5 నుంచి 14 వరకు జరుగుతాయని, జూన్ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్ఓల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించబడుతుందని ఆయన వెల్లడించారు.

ఈ సన్నద్ధత కార్యక్రమాల షెడ్యూల్ ప్రారంభానికి ముందుగా బుధవారం కలెక్టర్ కంచికచర్లలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. బూత్ స్థాయి అధికారి (బీఎల్ఓ)తో మాట్లాడి ఆ ప్రాంత ఓటర్ల జాబితా సమాచారాన్ని స్వయంగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మార్గదర్శకాలకు అనుగుణంగా సవరణ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని, అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని, రాజకీయ పార్టీలు మరియు భాగస్వామ్య పక్షాల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు.

ఈ పర్యటనలో నందిగామ ఆర్‌డీవో అనిల్ కుమార్, తహసీల్దార్ వి. మానస తదితరులు పాల్గొన్నారు.