వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ..

వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ..

24 గంటల్లోనే నిందితుల అరెస్ట్

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ: రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్‌లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిన ఇద్దరు నిందితులను పోలీసులు 24 గంటల్లోనే పట్టుకున్నారు. చోరీకి గురైన బంగారు గొలుసును పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీనివాస్ నగర్‌కు చెందిన లీల (66) మే 25న మధ్యాహ్నం తన ఇంటి వద్ద ఒంటరిగా ఉండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో, మందమర్రి సీఐ రమేష్, రామకృష్ణాపూర్ ఎస్‌ఐ జె. శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనాస్థల పరిసరాల్లోని సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుల కదలికలను గుర్తించారు.

దర్యాప్తులో భాగంగా సోమవారం శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని స్థానికంగా టెంట్ హౌస్ పనులు చేసే బక్కయ్య (38), రాము అలియాస్ ఇల్లాలు (35)గా గుర్తించారు. వారి వద్ద నుంచి చోరీ చేసిన బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

కేసును వేగంగా ఛేదించిన మందమర్రి సీఐ రమేష్, ఎస్‌ఐ శ్రీధర్ నేతృత్వంలోని పోలీసు బృందాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ సందర్భంగా వృద్ధులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా విలువైన ఆభరణాలు ధరించి ఒంటరిగా బయటకు వెళ్లవద్దని పోలీసులు సూచించారు.

Leave a Reply