వెల్గనూర్ ఎన్ఎంఎంఎస్ విజేతల తల్లిదండ్రులకు సన్మానం..
వెల్గనూర్, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని వెల్గనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం నూతన విద్యా సంవత్సరం సందర్భంగా బడిలో చేరిన విద్యార్థులకు ఉపాధ్యాయులు పుష్పగుచ్ఛాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. పాఠశాలలో అడుగుపెట్టిన విద్యార్థులను ఉత్సాహంగా ఆహ్వానించి, వారికి అవసరమైన పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన ప్రతిష్టాత్మక ఎన్‌ఎంఎంఎస్ (NMMS) ఉపకార వేతన పరీక్షలో ఎంపికైన విద్యార్థులు కావ్య, మణిదీప్‌ల తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం శాలువాలతో ఘనంగా సన్మానించిందని తెలిపారు.
విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారం ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని, పాఠశాల ఉపాధ్యాయులు వారికి అన్ని విధాలుగా సహకరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్‌పర్సన్ వజ్ర, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
