జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టును సందర్శన
మైనింగ్ శాఖ ముఖ్య కమిషనర్ ముకేశ్ కుమార్
తుగ్గలి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వ మైనింగ్ అండ్ జియాలజీ శాఖ ముఖ్య కమిషనర్ ముకేశ్ కుమార్ సోమవారం మండల పరిధిలోని జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టులో జరుగుతున్న తవ్వకాలు, ఖనిజ ఉత్పత్తి, భద్రతా ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలను పరిశీలించారు. ప్రాజెక్టు అధికారులు కమిషనర్‌కు గోల్డ్ మైనింగ్ కార్యకలాపాలు, ఉత్పత్తి విధానం, ఉపాధి అవకాశాలు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై వివరాలు అందజేశారు.
ప్రాజెక్టు పనులు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడంతో పాటు భద్రత, పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ సూచించారు. అనంతరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను పరిశీలించి, స్థానిక ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలు, సామాజిక బాధ్యత కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ శాఖ అధికారులు, గోల్డ్ ప్రాజెక్టు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

