కర్నూలులో మంత్రాలు.. అమెరికాలో ఉంగరాల మార్పిడి
- వీసా అడ్డంకి.. ప్రేమకు కాదు..
- డిజిటల్‌గా నిశ్చితార్థం
- వేల మైళ్ల దూరం.. ఒక్కటైన రెండు మనసులు
- సంప్రదాయం భారతీయమే.. వేదిక మాత్రం వర్చువల్!
కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ:
మాటే మంత్రము… మనసే బంధము!
వేల కిలోమీటర్ల దూరంలో అమెరికాలో ఉన్నా.. భారతీయ ఆచారాలు, కుటుంబ బంధాలు, వేద సంప్రదాయాలపై ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గలేదని కర్నూలుకు చెందిన ఓ జంట నిరూపించింది. వీసా ఇబ్బందుల కారణంగా స్వదేశానికి రాలేకపోయినా.. కర్నూలులో పురోహితుడు వేదమంత్రాలు చదువుతుండగా, అమెరికాలో వధూవరులు ఉంగరాలు మార్చుకుని డిజిటల్ నిశ్చితార్థానికి శ్రీకారం చుట్టారు. సాంకేతికతకు సంప్రదాయం జోడించిన ఈ అరుదైన వేడుక అందరినీ ఆకట్టుకుంది.
కర్నూలులో మంత్రాలు.. అమెరికాలో నిశ్చితార్థం
సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై ఉన్న మమకారం తగ్గదని కర్నూలుకు చెందిన ఓ కుటుంబం చాటిచెప్పింది. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూనే వేద సంప్రదాయాలకు ఎలాంటి భంగం కలగకుండా నిశ్చితార్థ వేడుకను నిర్వహించి అందరి ప్రశంసలు అందుకుంది.
కర్నూలుకు చెందిన మేఘన, తిరుపతికి చెందిన ప్రేమ్‌కుమార్ ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిద్దరి వివాహం పెద్దలు నిర్ణయించగా, నిశ్చితార్థాన్ని స్వదేశంలోనే నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావించారు. అయితే వీసా సంబంధిత సమస్యల కారణంగా జంట భారతదేశానికి రావడం సాధ్యపడలేదు.
దీంతో కుటుంబ సభ్యులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గురువారం కర్నూలులోని ఓ హోటల్‌లో భారీ ఎల్‌ఈడీ తెరలు, వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ఏర్పాటు చేసి, అమెరికాలో ఉన్న వధూవరులను నేరుగా అనుసంధానం చేశారు. ఇక్కడ పురోహితుడు వేదమంత్రాలు చదువుతుండగా, అక్కడ అమెరికాలో ఉన్న మేఘన–ప్రేమ్‌కుమార్ సంప్రదాయబద్ధంగా ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థాన్ని పూర్తి చేశారు. రెండు ఖండాల్లో ఒకేసారి జరిగిన ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందోత్సాహాల మధ్య నవదంపతులను ఆశీర్వదించారు.
భారతీయ వివాహ సాంప్రదాయాలు ఫ్రీ వెడ్డింగ్
ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమం డిజిటల్ రూపంలో జరిగినప్పటికీ, భారతీయ వివాహ సంప్రదాయాలకు ఎలాంటి లోటు రానీయకుండా అన్ని ఆచారాలను పాటించడం విశేషంగా నిలిచింది. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తమ మూలాలను మరువకుండా సంస్కృతి, కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయాన్ని ఈ వేడుక మరోసారి స్పష్టం చేసింది.
సాంకేతికత దూరాలను తగ్గించగలదని, కానీ భారతీయ సంప్రదాయాలే కుటుంబాలను మరింత దగ్గర చేస్తాయని ఈ నిశ్చితార్థం నిరూపించింది. వర్చువల్ వేదికపై జరిగినా, భావోద్వేగాలు మాత్రం ప్రత్యక్ష వేడుకను తలపించేలా కనిపించాయి.
ఇక ఈ జంట వివాహం ఆగస్టు 30న అమెరికాలోని న్యూయార్క్‌లో భారతీయ వేద సంప్రదాయాల ప్రకారం ఘనంగా జరగనుంది. విదేశాల్లో నివసిస్తూ భారతీయతను గుండెల్లో నిలుపుకున్న ఈ జంట కథ, ఆధునికతకు–సంప్రదాయానికి అద్భుత సమన్వయంగా నిలిచింది.
