చిన్నారుల ఆరోగ్య పర్యవేక్షణలో ఏఐ టెక్నాలజీ

చిన్నారుల ఆరోగ్య పర్యవేక్షణలో ఏఐ టెక్నాలజీ

ఎదుగుదల లోపాల ముందస్తు గుర్తింపునకు జిల్లా స్థాయి శిక్షణ

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: చిన్నారులలో ఎదుగుదల లోపాలు, అభివృద్ధి జాప్యాలు, ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ప్రభుత్వం కృత్రిమ మేధస్సు ఆధారిత స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించి జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం కర్నూలులో నిర్వహించారు.

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 0 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల చిన్నారుల ఎదుగుదల, మానసిక, శారీరక అభివృద్ధిని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం కీలకమని అన్నారు.

అభివృద్ధి లోపాలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే, చిన్నారులకు అవసరమైన వైద్య సేవలు, పోషకాహార సహాయం, ప్రత్యేక పునరావాస సేవలను సకాలంలో అందించడం సులభమవుతుందని తెలిపారు. కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతికతతో చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను మరింత కచ్చితంగా అంచనా వేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. దీనివల్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమైన పిల్లలను త్వరగా గుర్తించి, తగిన సేవలకు అనుసంధానం చేయడం సాధ్యమవుతుందని చెప్పారు.

జిల్లాలోని 27 మండలాలకు చెందిన వైద్యాధికారులు, సీడీపీవోలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆర్‌బీఎస్‌కే సమన్వయకర్తలు, శిశువైద్య నిపుణులు, జిల్లా ప్రారంభ జోక్య కేంద్రం ప్రతినిధులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా చిన్నారుల అభివృద్ధి దశలను గుర్తించే పద్ధతులు, ఏఐ ఆధారిత స్క్రీనింగ్ విధానం, అభివృద్ధి జాప్యాల నిర్ధారణ, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించి సంబంధిత వైద్య, పునరావాస సేవలకు అనుసంధానం చేసే ప్రక్రియలపై అవగాహన కల్పించారు.

ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ మాట్లాడుతూ, మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్‌బీఎస్‌కే బృందాలు, డీఈఐసీ సంయుక్త సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తామని తెలిపారు. ప్రతి చిన్నారికి అవసరమైన సేవలు అందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు.

జూన్ 5 నుంచి 10వ తేదీ వరకు మండల స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 0–6 సంవత్సరాల చిన్నారులకు ఏఐ ఆధారిత స్క్రీనింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల ఎదుగుదల, అభివృద్ధి, ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, వారికి అవసరమైన సేవలు చేరవేయవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.

Leave a Reply