బండి సంజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా
కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసిన బీజేపీ నాయకులు
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: కేంద్ర హోం సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను ఎల్కతుర్తి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బండి సంజయ్ కుమార్ తన అంకితభావం, నిబద్ధత, నిరంతర పోరాట పటిమతో భారతీయ జనతా పార్టీలో జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగి, నేడు కేంద్ర హోం సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం ప్రతి యువకుడికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
బండి సంజయ్ ఆశయాలు, సిద్ధాంతాలు, ప్రజాసేవా తత్వాన్ని ఆదర్శంగా తీసుకుని పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ముందుంటామని తెలిపారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో ఎల్కతుర్తి మండల అభివృద్ధికి మరింత కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా నిరంతరం పనిచేస్తామని పేర్కొన్నారు.
జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి కార్యకర్తలు, ప్రజలకు అరటిపండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులు, మండల బాధ్యులు, జిల్లా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
