Irrigation Project | గత పాలనలో బ్రోకరైజ్డ్ పాలిటిక్స్‌

Irrigation Project | గత పాలనలో బ్రోకరైజ్డ్ పాలిటిక్స్‌

  • పర్సంటేజ్ రాజకీయాలు
  • పనిఇస్తే ముందే పర్సంటేజ్ ఇవ్వాలి
  • ఇలాంటి చిల్లర అలవాట్లు మాకు లేవు
  • అలాంటి అలవాట్లు ఉంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోవడమే మేలు
  • తమ పాలనలో చేయి చాపే గుణం కాదు – చేయి ఇచ్చే గుణం
  • రాష్ట్ర పశుసంవర్ధక క్రడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Irrigation Project | మక్తల్, ఆంధ్రప్రభ : గత పాలనలో బ్రోకరైజ్డ్ పాలిటిక్స్‌(Brokered Politics), పర్సంటేజ్ రాజకీయాలు నడిచాయని, పనిఇస్తే ముందే పర్సంటేజ్ ఇవ్వాలి… ఇలాంటి చిల్లర అలవాట్లు త‌మకు లేవని, అలాంటి అలవాట్లు ఉంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోవడమే మేలంటూ రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి(Minister Dr. Vakiti Srihari) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ‌ పాలమూరు ఉమ్మడి జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తమ పాలనలో చేయి చాపే గుణం కాదు – చేయి ఇచ్చే గుణం ఉందన్నారు.

ఇటీవల మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్‌గా మంత్రి వాకిటి శ్రీహరి అమరచింతలో నిర్వహించిన ప్రెస్‌మీట్(Press Meet) రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. ఈ సమావేశంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. గత పాలనలో పని కావాలంటే త‌మ గేట్ల దగ్గరకు రావద్దు, మధ్యవర్తుల ద్వారానే రావాలి, పని ఇస్తే ముందే పర్సంటేజ్ ఇవ్వాలన్న కఠిన నిబంధనలు ఉండేవన్నారు. ఇలాంటి చిల్లర అలవాట్లు త‌మకు లేవు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలతోనే ఆగకుండా, అలాంటి అలవాట్లు ఉంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోవడమే మేలని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. తమ పాలనలో పేదోడిని ఆదుకునే గుణమే త‌మ రాజకీయ గుణమ‌ని మంత్రి స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో 18 సంవత్సరాలు పదవులు అనుభవించి, సంగంబండ గాని, భూత్పూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు(Irrigation Project)ల్లో గేట్లు ఒంగిపోయినా కనీసం కొత్త గేట్లు కూడా ఏర్పాటు చేయలేని వారు, ఇప్పుడు తమపై విమర్శలు చేయడం విడ్డూరం, దౌర్భాగ్యమని మంత్రి వాకిటి శ్రీహరి మండిపడ్డారు.

ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఆత్మకూరు, అమరచింత, మక్తల్, ఊట్కూర్, మాగనూర్, కృష్ణ మండలాల్లో పేదవారెవరూ కనిపించలేదా..?అని ఆయన ప్రశ్నించారు. ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కట్టించలేని వారు అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం(Government) రాజకీయాలకతీతంగా పేదలకు న్యాయం చేస్తోందని పేర్కొన్న మంత్రి, మక్తల్ నియోజకవర్గంలో 3600 ఇండ్లను మంజూరు చేసి, ప్రతి ఇంటికి రూ.5లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని వెల్లడించారు. అంతేకాకుండా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.

మక్తల్ నియోజకవర్గంకు నేడు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ప్రజలకు పనిచేయాలన్న ధ్యాస ఉంటే ఏ రకంగానైనా అభివృద్ధి చేయవచ్చన్నారు. రోడ్ల నిర్మాణానికి(Construction) అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి త‌మ అభిమతం, పేదల సంక్షేమం మా లక్ష్యమ‌ని, నిరంతరం పేద ప్రజల సంక్షేమానికి నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తానని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఎవరైనా ఏ సమయంలోనైనా నేరుగా తమ వద్దకు రావచ్చని, ఎలాంటి ఆంక్షలు ఉండవన్నారు.

మధ్యవర్తుల ప్రమేయం అసలే లేదన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 100కు 100 శాతం సీట్లు గెలిచి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి విజ్ఞప్తి చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో టిపిసి అధికార ప్రతినిధి పీసీసీ చైర్మన్ కల్లుగీత డిపార్ట్మెంట్(Department) కేశం నాగరాజు గౌడ్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయూబ్ ఖాన్, అమరచింత పట్టణ అధ్యక్షులు ఎస్ఎం .అరుణ్ కుమార్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు విష్ణు యాదవ్, డి మోహన్, రవికాంత్, కమలాకర్ గౌడ్, అరవింద్ రెడ్డి, మాజీ ఎంపిటిసి మహంకాళి విష్ణు, తిరుమలేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.