వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి

వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి
- ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి
మరిపెడ, ఆంధ్రప్రభ:
వేసవి కాలం దృష్ట్యా మండలంలోని ఏ గ్రామంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు తగిన జాగ్రత్తలు మరియు ముందస్తు చర్యలు తీసుకోవాలని మరిపెడ ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత శాఖల అసిస్టెంట్ ఇంజనీర్లతో (ఏఈ) ఆయన ఒక ముఖ్య సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అన్ని గ్రామ పంచాయతీలలో తాగునీటి సరఫరా సజావుగా సాగేలా చూడటంతో పాటు, గ్రామాల్లో పారిశుధ్య (శానిటేషన్) పనులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. దీంతో పాటు వివిధ ప్రభుత్వ అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన ప్రజాప్రతినిధులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మంజూరైన మరుగుదొడ్లు, ప్రహరీ గోడల నిర్మాణ పనులను వేసవి సెలవులు ముగిసి, పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోపు త్వరితగతిన పూర్తి చేయాలని సర్పంచులను ఆదేశించారు.
అలాగే మండలంలో మంజూరైన ఐకేపీ వీఓ భవనాల నిర్మాణ పనులను జూన్ నెలాఖరు నాటికి, ఉపాధి హామీ కింద మంజూరైన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను జూన్ 2వ తేదీ లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ వివిధ కారణాల వల్ల ఇల్లు నిర్మించుకోలేకపోతున్న లబ్ధిదారుల నుండి రాతపూర్వక అంగీకారం తీసుకోవాలని, వారి స్థానంలో కమిటీ ద్వారా నిజమైన అర్హులైన, ఇల్లు లేని పేదలను గుర్తించి ఇండ్లు మంజూరు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో మండల పరిషత్ అధికారి (ఎంపీఓ) సోమ్లాల్ నాయక్, పీఆర్ ఏఈ అజయ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ హతీరామ్, హౌసింగ్ ఏఈలు ఉషాకీర్తి, గోపి, ఏపీఎం అలివేలు మంగతో పాటు అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
