ఇల్లు పోయిన దిగులుతో యజమాని మృతి

ఇల్లు పోయిన దిగులుతో యజమాని మృతి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: రోడ్డు విస్తరణ రూపంలో వచ్చిన కష్టం ఒక పేద కుటుంబాన్ని నిలువునా ముంచేసింది. గూడు చెదిరిన దిగులుతో, ఆ గూటిని మళ్ళీ నిర్మించుకోలేననే తీవ్ర మనోవేదనతో ఓ వ్యక్తి ప్రాణాలొదిలిన విషాద ఘటన తూప్రాన్‌పేట గ్రామ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్‌పేట గ్రామానికి చెందిన చెంచల నరసింహ (42) ఎంతో కష్టపడి జాతీయ రహదారి 65 (NH-65) కు ఆనుకొని ఇంటి నంబర్ 1-44లో ఒక సొంత ఇంటిని నిర్మించుకున్నాడు. అయితే, ఇటీవలి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అధికారులు ఆ ఇంటిని కూల్చివేశారు. ప్రభుత్వం అందించిన నష్టపరిహారం మాత్రం ప్రస్తుత మార్కెట్ ధరలకు కనీసం కొత్త ఇంటి పునాది వేయడానికి కూడా సరిపోని పరిస్థితి నెలకొంది.

సొంత ఇల్లు కోల్పోవడంతో కుటుంబంతో కలిసి అద్దె ఇంట్లోకి మారిన నరసింహ నిత్యం తీవ్ర ఆవేదన చెందేవాడు. భార్య, తల్లి, ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉండలేక, చేతిలో డబ్బుల్లేక కొత్త ఇల్లు కట్టుకోలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ప్రతిరోజు తన ఇల్లు కూలిపోయిన విషయంపైనే ఇంట్లో చర్చిస్తూ దిగులు చెందేవాడని, ఆ బాధ భరించలేకపోయేవాడని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఇదే క్రమంలో తీవ్ర మనోవేదనతో ఉన్న నరసింహకు శుక్రవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కన్నుమూశారు.

మృతుడు నరసింహకు భార్య, ఐదు సంవత్సరాల కుమార్తె, మూడు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. రెక్కల కష్టం నమ్ముకుని బతికే కుటుంబానికి పెద్ద దిక్కు అయిన నరసింహ మరణించడంతో ఆ కుటుంబం పూర్తిగా రోడ్డున పడింది. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి, బాధితుడి ఇల్లు కోల్పోయినందుకు మెరుగైన నష్టపరిహారం అందించాలని, అలాగే అనాథలైన చిన్న పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని తూప్రాన్‌పేట గ్రామస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply