సహకార బ్యాంకుల బలోపేతానికి డిపాజిట్ల పెంపే కీలకం
జిల్లా సహకార వారోత్సవాల్లో కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపు
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : సహకార బ్యాంకులు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలంటే డిపాజిట్ల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా సహకార వారోత్సవాల సందర్భంగా సోమవారం చిత్తూరులోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీలక్ష్మి, బ్యాంకు మేనేజర్లు, సహకార సంఘాల అధ్యక్షులు, బోర్డు సభ్యులతో కలిసి మొబైల్ ఏటీఎం వాహనాలను ప్రారంభించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మొక్కలు నాటారు. జిల్లాలో సహకార రంగ అభివృద్ధి, రైతులకు రుణాల కల్పన, డిపాజిట్ల పెంపు, రుణాల వసూళ్లు, నిరర్థక ఆస్తుల నియంత్రణ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని బ్యాంకులు సేకరించిన మొత్తం డిపాజిట్లలో డీసీసీబీ వాటా కేవలం 3.20 శాతం మాత్రమే ఉండగా, రుణాల పంపిణీలో 5.25 శాతం వాటాను కలిగి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో రుణాల కోసం రాష్ట్ర సహకార బ్యాంకు, నాబార్డ్ వంటి సంస్థలపై అధికంగా ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. డిపాజిట్లు పెరిగితే బ్యాంకు స్వంత నిధులు బలోపేతమై రైతులకు అవసరమైన సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణ రుణాలు అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సహకార బ్యాంకులపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించేందుకు పారదర్శకత, క్రమశిక్షణతో పనిచేయాలని, డిపాజిట్ల సేకరణలో ప్రజాప్రతినిధులు, సహకార సంఘాల ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార బ్యాంకులు వెన్నెముకలాంటివని, రైతులు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి సకాలంలో రుణాలు అందిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. రుణాల మంజూరు, వసూళ్లు, నిరర్థక ఆస్తుల నియంత్రణపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యవస్థ బలోపేతమైతేనే బ్యాంకులపై ప్రజల నమ్మకం పెరుగుతుందని, సహకార బ్యాంకులు బలపడితే రైతాంగానికి మరింత మెరుగైన సేవలు అందించగలవని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో సుమారు 3 లక్షల కుటుంబాలు సహకార రంగం ద్వారా లభిస్తున్న రుణాలపై ఆధారపడి జీవనోపాధి సాగిస్తున్నందున ఈ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం “సహకారంతో సమృద్ధి” లక్ష్యాన్ని సాధించేందుకు సహకార రంగ అభివృద్ధికి కృషి చేస్తామని అధికారులు, ఉద్యోగులు, సహకార సంఘాల ప్రతినిధులతో కలసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లాలోని 71 సహకార సంఘాలకు రూ.3,50,95,151 డివిడెండ్ మొత్తానికి సంబంధించిన చెక్కులను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి చంద్రశేఖర్, డీసీసీబీ సీఈఓ శంకర్ బాబు, సురేష్ బాబు, బ్యాంకు అధికారులు, బోర్డు సభ్యులు, సహకార సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
