Telangana Tigers | తెలంగాణలో పులుల సంరక్షణకు అమ్రాబాద్ కేంద్రం
Telangana Tigers | తెలంగాణలో పులుల సంరక్షణకు అమ్రాబాద్ కేంద్రం
Telangana Tigers | అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 42 పులుల గుర్తింపు
2,240 కెమెరాలతో ఎనిమిది నెలల సర్వే
ఆడ పులుల సంఖ్య పెరగడం శుభసూచకం
పులి పిల్లల పెరుగుదలతో సంతానోత్పత్తికి మంచి సంకేతాలు
Telangana Tigers | హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పెద్ద పులులకు అడ్డాగా మారింది. ఇక్కడి టైగర్ రిజర్వ్‌లో పులుల జనాభా స్థిరంగా ఉండటమే కాకుండా, పులుల సంతానోత్పత్తికి అనువుగా ఉందని అఖిల భారత పులుల సంఖ్య అంచనా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
తాజాగా అఖిల భారత పులుల సంఖ్య అంచనా (ఏఐటీఈ)-2026 ప్రకారం అమ్రాబాద్ అడవుల్లో మొత్తం 42 పులులు నివాసం ఉంటున్నట్లు తేలింది. ఈ సంఖ్య గతంలో 36 ఉండగా, ప్రస్తుతం పులుల సంఖ్య 42కి చేరినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్, అచ్చంపేట, నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అటవీ విభాగాల్లో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఉంది. సుమారు 2,611.4 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ అటవీ ప్రాంతం తెలంగాణలో అత్యధిక సంఖ్యలో పులులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను 1983లో అభయారణ్యంగా ప్రకటించగా, 2014లో తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌గా ప్రకటించారు.
2,240 కెమెరాలతో…
దేశవ్యాప్తంగా మొత్తం 51 టైగర్ రిజర్వ్ కేంద్రాలు ఉండగా, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ దేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ కేంద్రాల్లో ఒకటి. కోర్ ఏరియా పరంగా రెండో అతిపెద్దది. విస్తీర్ణంలో ఆరో అతిపెద్దదిగా ప్రసిద్ధి చెందింది. నల్లమల అటవీ మార్గంలో భాగమైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో అనేక స్థానిక వృక్ష, జంతు జాతులతో కూడిన గొప్ప జీవవైవిధ్యం ఉంది.
అఖిల భారత పులుల సంఖ్య అంచనా (ఏఐటీఈ)-2026 సర్వేను 2025 నవంబర్ నుంచి 2026 జూన్ వరకు సుమారు ఎనిమిది నెలల పాటు నిర్వహించారు. మొత్తం 2,611 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ టైగర్ రిజర్వ్‌ను గ్రిడ్ ఆధారిత కెమెరా ట్రాప్ విధానంలో పక్కా ప్రణాళికతో సర్వే చేపట్టారు.
ఈ సర్వేలో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను 2 చదరపు కిలోమీటర్ల చొప్పున గ్రిడ్లుగా విభజించారు. వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన 1,120 ప్రదేశాల్లో మొత్తం 2,240 కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశారు. ఈ సర్వేను నాలుగు దశల్లో నిర్వహించగా, ప్రతి బ్లాక్‌ను 30 రోజుల పాటు పర్యవేక్షించారు. ఈ విస్తృతమైన క్షేత్రస్థాయి కార్యక్రమాన్ని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, నాగర్‌కర్నూల్ జిల్లా అటవీ అధికారులు పర్యవేక్షణలో నిర్వహించారు.
ఆడ పులులే అధికం..
రాష్ట్రంలో మొత్తం అభయారణ్యాలు ఉండగా, అందులో అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 2024 సర్వే ప్రకారం 36 పులులు ఉండగా, 2026 నాటికి ఈ పులుల సంఖ్య 42కు పెరిగినట్లు తెలుస్తోంది. వీటిలో ప్రాథమిక విశ్లేషణ ప్రకారం 18 ఆడ పులులు, 14 మగ పులులు, రెండు యుక్తవయస్సు రాని పులులు, మరో 8 పులి పిల్లలు ఉన్నట్లు సర్వేలో ప్రాథమికంగా గుర్తించారు.
రిజర్వ్‌లో మగ పులుల కంటే ఆడ పులులే ఎక్కువగా ఉండటం మంచి సంకేతమని అధికారులు భావిస్తున్నారు. పులి పిల్లలు, యుక్తవయస్సు రాని పులుల ఉనికి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో చురుకైన సంతానోత్పత్తిని, ఆరోగ్యకరమైన పునరుత్పత్తి పరిస్థితిని సూచిస్తోందని అధికారులు చెబుతున్నారు.
