ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాల సొంతింటి కల సాకారమవుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శీలం అనిల్ కుమార్ అన్నారు.మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు పథకం కింద రూ.5 లక్షల వ్యయంతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న లబ్ధిదారులు బండారి లక్ష్మి–రాజు, అల్లం శిరీష–రాజు కుటుంబాల గృహప్రవేశ కార్యక్రమాలను గురువారం ఎంపీడీవో విజయ్ కుమార్ ప్రారంభించారు.అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా శీలం అనిల్ కుమార్ మాట్లాడుతూ, అర్హులైన లబ్ధిదారులకు పక్కా గృహాలను నిర్మించి అందించడమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.కొత్త ఇంటిలో కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
