ఆంధ్ర ప్రభ ఎఫెక్ట్… మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఆంధ్ర ప్రభ ఎఫెక్ట్… మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం
కొనుగోళ్లలో జాప్యంపై వెలువరించిన కథనానికి స్పందించిన అధికారులు
తొర్రూరు, ఆంధ్రప్రభ : మండలంలోని సోమారం గ్రామంలో మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యంపై ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. రాజకీయాల ప్రభావంతో మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం లేదంటూ పత్రికలో ప్రచురితమైన కథనానికి ఎమ్మెల్యే తో పాటు, సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆదివారం మండలంలోని సోమారం గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతిరెడ్డి ప్రారంభించారు.
చైర్మన్ మాట్లాడుతూ దళారులను నమ్మి మోసపోకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మొక్కజొన్నలు విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రభుత్వం మక్కలకు క్వింటాల్ కు రూ.2400 మద్దతు ధర అందిస్తుందని, 14 శాతం తేమతో మొక్కజొన్నలను కేంద్రాలకు తీసుకువచ్చి వారం రోజుల్లో డబ్బులు పొందాలని కోరారు. కేంద్రానికి మొక్కజొన్నలు తీసుకువచ్చే రైతులు పంట సాగు ధ్రువీకరణ పత్రం, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్,ఆధార్ కార్డు జిరాక్స్ లు వెంట తీసుకురావాలని సూచించారు.
కేంద్రం నుంచి మద్దతు లేకపోయినప్పటికీ, రైతులకు సరసమైన ధరలు అందేలా చూస్తూ, రూ. 2,500 కోట్ల విలువైన మొక్కజొన్నను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని అన్నారు. మక్కల రైతులకు అనుకూలంగా కథనం వెలువరించిన ఆంధ్రప్రభ దినపత్రికకు రైతులు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగమూర్తి, పిఎసిఎస్ సీఈఓ శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, సహదేవ్,తదితరులు పాల్గొన్నారు.
