VivaTech-2026 | ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో భారత్ అగ్రగామి : మోదీ

  • ఆవిష్కరణలే సవాళ్లకు పరిష్కారం
  • సాంకేతిక విప్లవంతో భారత్ రూపాంతరం చెందింది

ఆంధ్రప్రభ : ప్రపంచం 2021 సంవ‌త్స‌రంలో కరోనా మహమ్మారి సవాళ్లను ఎదుర్కొంటే, ప్రస్తుతం ఇతర రకాల అంతరాయాలను ఎదుర్కొంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్‌లోని వివాటెక్-2026 సదస్సులో ప్రసంగించిన ఆయన.. “సాంప్రదాయ విధానాలు విఫలమైనప్పుడు ఆవిష్కరణలే పరిష్కారాలను చూపిస్తాయి” అని పేర్కొన్నారు.

గత దశాబ్ద కాలంలో సాంకేతికత ఆధారంగా భారత్ వేగంగా రూపాంతరం చెందిందని మోదీ చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ గుర్తింపు వ్యవస్థ, అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వేదికలను భారత్ నిర్మించిందన్నారు. ఆర్థిక చేరిక, విద్య, టెలీమెడిసిన్, వ్యవసాయం తదితర రంగాల్లో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని తెలిపారు.

యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) కారణంగా ప్రస్తుతం ప్రపంచంలోని రియల్‌టైమ్ డిజిటల్ లావాదేవీలలో సగం భారత్‌లోనే జరుగుతున్నాయని మోదీ వెల్లడించారు. ఇప్పుడు ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్, పారిస్ విమానాశ్రయంలో కూడా యూపీఐ ద్వారా చెల్లింపులు చేయవచ్చని చెప్పారు.

డిజిలాకర్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ డాక్యుమెంట్ వాలెట్లలో ఒకటిగా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. 70 కోట్ల మంది వినియోగదారులు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా అసలైన డిజిటల్ పత్రాలను పొందగలుగుతున్నారని చెప్పారు. 2,000కు పైగా ప్రామాణిక పత్రాలు డిజిలాకర్‌లో అందుబాటులో ఉండటంతో డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ వంటి పత్రాలను భౌతికంగా భద్రపరచాల్సిన అవసరం గణనీయంగా తగ్గిందన్నారు. గతంలో నెలల తరబడి పట్టే ప్రాజెక్టుల సర్వేలు ఇప్పుడు కొన్ని వారాల్లోనే పూర్తవుతున్నాయని వివరించారు.