Women’s T20 World Cup-2026 | నెదర్లాండ్స్‌పై భారత మహిళల ఘన విజయం

  • మంధానా, షెఫాలీ మెరుపులు..
  • బౌలర్ల ధాటికి డచ్ జట్టు కుప్పకూలింది
  • 95 పరుగుల తేడాతో వరుసగా రెండో విజయం

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భారత మహిళల జట్టు మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. లీడ్స్‌లోని హెడ్డింగ్లీ మైదానంలో జరిగిన గ్రూప్-1 మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను 95 పరుగుల భారీ తేడాతో ఓడించి వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో పాయింట్స్ టేబుల్లో భార‌త్ జ‌ట్టు 4 పాయింట్ల‌తో (3.975 నెట్ ర‌న్ రేట్ తో) టాప్ లో నిలిచింది.

కాగా, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధానా, షెఫాలీ వర్మ తొలి నుంచే దూకుడుగా ఆడి డచ్ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు భారీ పునాది వేశారు. స్మృతి మంధానా 47 బంతుల్లో 74 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలవగా, షెఫాలీ వర్మ 38 బంతుల్లో 55 పరుగులతో మెరిసింది. చివర్లో రిచా ఘోష్ 8 బంతుల్లో అజేయంగా 20 పరుగులు, దీప్తి శర్మ 2 బంతుల్లో 10 పరుగులు చేసి స్కోరును 209కు చేర్చారు.

కుప్ప‌కూలిన‌ డ‌చ్ జ‌ట్టు..

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌కు ఆరంభంలో హీథర్ సీగర్స్ (21), ఫీబే మోల్కెన్‌బోర్ (15) కొంత పోరాటం చేసినా భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. కెప్టెన్ బాబెట్ డి లీడ్ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతా బ్యాటర్లు విఫలమవడంతో నెదర్లాండ్స్ 17.3 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

బౌలింగ్‌లో చరణి సూపర్

భారత బౌలర్లలో తెలుగ‌మ్మాయి శ్రీ చరణి అద్భుత ప్రదర్శన చేసింది. నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. షెఫాలీ వర్మ బంతితోనూ రాణించి 3 వికెట్లు తీసింది. నందని శర్మ రెండు వికెట్లు సాధించగా, భారత బౌలింగ్ దళం డచ్ బ్యాటింగ్‌ను పూర్తిగా కట్టడి చేసింది. ఈ విజయంతో భారత్ గ్రూప్ దశలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ సెమీఫైనల్ అవకాశాలను మరింత బలోపేతం చేసుకుంది.