Cinema | ఏపీకి తరలి రండి.. స్టూడియోలు నిర్మించండి – టాలీవుడ్ కు మంత్రి పిలుపు

అంద‌మైన లోకేష‌న్లు ఉన్నాయి
భారీ స్థాయిలో రాయితీలు ఇస్తాం
సింగిల్ విండో ద్వారా వెంట‌నే అనుమ‌తిస్తాం
అసెంబ్లీలో సినీ పరిశ్రమపై ప్రశ్నోత్తరాలు
చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
వివ‌రాలు వెల్ల‌డించిన మంత్రి దుర్గేష్

వెల‌గ‌పూడి, ఆంధ్రప్రభ :
ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కేవలం షూటింగ్ చేసి వెళ్లిపోవడం, ఆదాయం తీసుకోవటం కాకుండా.. స్టూడియోల నిర్మాణంపై దృష్టి సారించాలని సినీ పెద్ద‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. విశాఖలో సినీ పరిశ్రమపై విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అసెంబ్లీలో మ‌ట్లాడుతూ.. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం స్టూడియోల నిర్మాణానికి గతంలో ప్రభుత్వం భూములు కేటాయించింద‌న్నారు. ఆ క్రమంలో ప్రముఖ నిర్మాత రామానాయుడు స్టూడియో నిర్మాణానికి 35 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింద‌ని వెల్ల‌డించారు. అయితే.. ఆ భూమిని స్టూడియో కోసం వినియోగించకుండా కొంత భూమిని లే అవుట్లు వేసి విక్రయించే ప్రయత్నాలు జరిగాయని, తాను న్యాయపోరాటంతో లేఅవుట్ విక్రయాలను నిలుపుదల చేయించాన‌ని తెలిపారు.. తాజాగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. రామానాయుడు స్టూడియోకు గతంలో ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇచ్చిన ప్ర‌భుత్వం వేరు.. అమ్మింది వేరు..

ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమిని స్టూడియో కోసం వినియోగించలేనందున ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే రామకృష్ణ‌బాబు కోరారు. దీనికి మంత్రి దుర్గేష్ స‌మాధానం చెబుతూ.. గతంలో రామానాయుడు స్టూడియో కోసం 34.44 ఎకరాలు భూమి కేటాయించామ‌ని, దానిలో కొంతభాగం 15ఎకరాల్లో లేఅవుట్ వేసి వేరే అవసరాల కోసం వాడాలని చూశార‌న్నారు. ఇచ్చిన ప్రభుత్వం వేరు.. వేరే అవసరాల కోసం వాడాలని చూసిన ప్రభుత్వం వేరు అని మంత్రి చెప్పారు. త‌మ ప్ర‌భుత్వంలో గ‌తంలో ఏం జ‌రిగింద‌నే దాని కంటే సీని ప‌రిశ్ర‌మ‌ను ఏపీలో అభివృద్ది చేయాల‌ని భావిస్తున్నామ‌ని చెప్పారు. విశాఖలో ఇప్పటికిప్పుడు సినీ ఇండస్ట్రీ తీసుకువచ్చే ప్రతిపాదన లేదన్నారు. సినీ నిర్మాతలు, ప్రముఖులతో మాట్లాడి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఏపీలో సినిమాలు తీసేందుకు చాలా లొకేషన్లు ఉన్నాయని మంత్రి చెప్పారు. ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంద‌ని పేర్కొన్నారు.

ఇదే సంద‌ర్బంగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మండ‌లిలో మాట్లాడుతూ.. విశాఖలో గత ప్రభుత్వాల సమయాల్లో భూకేటాయింపులు జరిగాయి. అవి ఇప్పుడు చర్చించదలుచుకోలేదు కానీ.. అక్కడ భూములు తీసుకున్న వారు స్టూడియోలు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలి. భవిష్యత్తులో కాకుండా.. వెంటనే కొనసాగించే ప్రయత్నం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *