Breaking | వైన్ షాపులో అగ్నిప్రమాదం..

  • షార్ట్ సర్క్యూట్‌తో మంటలు..
  • రూ.2 లక్షల ఆస్తి నష్టం
  • సమయానికి స్పందించిన స్థానికులు..
  • తప్పిన భారీ ప్రమాదం

ఆంధ్రప్రభ, చిట్యాల : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామంలోని ఓ వైన్ షాపులో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు షాప్ నిర్వాహకులు తెలిపారు. గ్రామ ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ వైన్ షాపులో రెండు షట్టర్లు ఉన్నాయి. ఒక షట్టర్‌లో మద్యం విక్రయాలు నిర్వహిస్తుండగా, మరో షట్టర్‌లో బీరు కార్టన్‌లను నిల్వ ఉంచారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా బీరు కార్టన్‌లకు వ్యాపించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

అగ్నిప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే షాప్ నిర్వాహకులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని స్థానికుల సహకారంతో నీటిని ఉపయోగించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే మంటల వేడికి పలువురు బీరు సీసాలు పగిలిపోవడంతో గణనీయమైన నష్టం సంభవించింది. సమయానికి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.