TTD | ఒక్కరోజే దాదాపు రూ.97 కోట్ల విరాళాలు..
రూ.10లక్షలకు పైగా సమర్పించిన దాతలు 1248
తిరుమల ప్రతినిధి, ఆంధ్రప్రభ : తిరుమలేశునికి విరాళాలు సమర్పించే దాతలకు కల్పించే సౌకర్యాలలో మార్పుచేర్పుల నిర్ణయం నేపథ్యంలో టి టి డి నిన్న ఒక్కరోజే విరాళాలు వెల్లువెత్తాయి. అధికారిక సమాచారం ప్రకారం ఈ నెల 14వ తేదీ ఒక్కరోజే రూ 96.98 కోట్ల విరాళాలను దాతలు సమర్పించారు. అందులో 1,212 మంది రూ 1 లక్ష నుంచి రూ 10 లక్షల వరకు సమర్పించినవారు కాగా 1,246 మంది రూ.10లక్షల నుంచి రూ.25 లక్షల వరకు సమర్పించినవారున్నారు. ఇద్దరు భక్తులు రూ.1 కోటి కన్నా ఎక్కువ విరాళాలను సమర్పించారు.
బుధవారం నుంచి టి టి డి కి చెందిన వివిధ ట్రస్టులకు విరాళాలు సమర్పించే దాతలకు కల్పించే సౌకర్యాలలో మార్పు చేర్పులు అమలులోకి వస్తాయని మంగళవారం జరిగిన టి టి డి ధర్మకర్తల మండలి సమావేశంలో చేసిన తీర్మానమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం టి టి డి ట్రస్టులకు విరాళాలు సమర్పించే దాతలుగా 1,97,888 మంది నమోదై ఉన్నారు. గణనీయంగా పెరుగుతున్న దాతలకు కల్పించే సౌకర్యాల కారణంగా సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగరాదనే లక్ష్యంతో టి టి డి ధర్మకర్తల మండలి సౌకర్యాలలో తక్షణమే అమలు చేయాలని నిర్ణయించింది. ఫలితంగా మంగళవారం ఒక్కరోజే టి టి డి ట్రస్టులకు దాదాపు రూ 97 కోట్ల విరాళాలు వెల్లువెత్తాయి.
