బంగ్లాదేశ్లో వరద బీభత్సం.. 51 చేరిన మృతుల సంఖ్య
- 2.67 లక్షల కుటుంబాలు ప్రభావితం..
- ఢాకాలో జనజీవనం అస్తవ్యస్తం..
- మరింత వరదల ముప్పు
ఆంధ్రప్రభ : బంగ్లాదేశ్లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. బంగ్లాదేశ్ దేశవ్యాప్తంగా సంభవించిన ప్రకృతి విపత్తుల్లో మృతుల సంఖ్య 51కు చేరినట్లు బంగ్లాదేశ్ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లువురు కొండచరియలు విరిగిపడటంతో ప్రాణాలు కోల్పోగా, మరికొందరు వరద నీటిలో కొట్టుకుపోవడం లేదా మునిగిపోవడం వల్ల మృతి చెందినట్టు అధికారుల తెలిపారు. ఉప్పొంగుతున్న నదులు పలు ప్రాంతాలను ముంచెత్తడంతో పరిస్థితి రోజురోజుకూ మరింత విషమిస్తోంది.
2.67 లక్షల కుటుంబాలు వరద ప్రభావం..
రాత్రిపూట కురిసిన భారీ వర్షాల కారణంగా రాజధాని ఢాకాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు జలమయం కావడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 2.67 లక్షల కుటుంబాలు వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ, పలు జిల్లాల్లో సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు సైన్యం, నౌకాదళం, వైమానిక దళం రంగంలోకి దిగాయి. స్థానిక మానవతా సంస్థలతో కలిసి అత్యంత ప్రభావితమైన ఏడు జిల్లాల్లో సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. బంగ్లాదేశ్ వరద అంచనా, హెచ్చరిక కేంద్రం (FFWC) నదుల నీటిమట్టం మరింత పెరిగే అవకాశముందని హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, వాయవ్య జిల్లాల్లో వరదలు మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని, ఈశాన్య ప్రాంతాల్లో కూడా పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని పేర్కొంది.
