శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తిరుమల, ఆంధ్రప్రభ: కేంద్ర సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి, ఈ ఏడాది వర్షపాతం పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ నెలలో నమోదవాల్సిన వర్షాల్లో కేవలం 40 నుంచి 50 శాతం మాత్రమే కురిసినట్లు పేర్కొన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని, దేశ వ్యవసాయ రంగంతో పాటు ప్రజల అవసరాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు.

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ ఒకటని, దేశ అవసరాలు సక్రమంగా నెరవేరాలంటే సమృద్ధిగా వర్షాలు కురవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థించినట్లు వెల్లడించారు.

అలాగే నీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. వర్షపు నీటిని వృథా కాకుండా నిల్వ చేసుకోవడం, ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకోవడం కాలానుగుణ అవసరమని ప్రజలకు సూచించారు.