Ichoda నకిలీ పత్తి విత్తనాల గుట్టురట్టు.. ఇద్దరు అరెస్ట్
Ichoda నకిలీ పత్తి విత్తనాల గుట్టురట్టు.. ఇద్దరు అరెస్ట్
ఇచ్చోడ (Ichoda), ఆంధ్రప్రభ: రైతులను మోసం చేస్తూ నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ఇద్దరిని ఇచ్చోడ పోలీసులు, వ్యవసాయ మరియు రెవెన్యూ శాఖల సంయుక్త టాస్క్‌ఫోర్స్ బృందం ప్రత్యేక తనిఖీల్లో అరెస్ట్ చేసింది. మొత్తం 58 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఇచ్చోడ ఎస్‌హెచ్‌వో కె. నరేష్ కుమార్ తెలిపారు.
ధాబా (బి) గ్రామానికి చెందిన నర్వాటే ఈశ్వర్ వద్ద తనిఖీలు నిర్వహించగా 34 ‘పింక్ బాండ్ 5జీ’ నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ విత్తనాలను పాపిన్వార్ సునీల్ కుమార్, ఆదిలాబాద్ వద్ద నుంచి కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అలాగే ఇప్పటికే సుమారు 300 ప్యాకెట్లను విజయ్‌కు విక్రయించినట్లు కూడా గుర్తించారు.
మరో కేసులో సోమవారం ఇచ్చోడ మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీలో రాథోడ్ గణేష్ వద్ద తనిఖీలు నిర్వహించగా 24 నకిలీ విత్తనాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఇవి కూడా పాపిన్వార్ సునీల్ కుమార్ వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితులుగా నర్వాటే ఈశ్వర్ (ధాబా బి గ్రామం, ఇచ్చోడ మండలం), రాథోడ్ గణేష్ (సాయినగర్ కాలనీ, ఇచ్చోడ)లను గుర్తించారు. ప్రధాన సరఫరాదారుగా గుర్తించిన పాపిన్వార్ సునీల్ కుమార్ ఇప్పటికే మరో కేసులో రిమాండ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న హట్కరే విజయ్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
స్వాధీనం చేసిన విత్తనాల ప్యాకెట్లపై తప్పనిసరిగా ఉండాల్సిన టెస్టింగ్ తేదీ, ప్యాకింగ్ తేదీ, లాట్ నంబర్, గడువు తేదీ వంటి వివరాలు లేకపోవడంతో అవి నకిలీవిగా నిర్ధారించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద విక్రయాలపై వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.
