Revanth Reddy | కోర్ అర్బన్ రీజియన్‌లో హై అలర్ట్

Revanth Reddy | కోర్ అర్బన్ రీజియన్‌లో హై అలర్ట్

  • హైదరాబాద్ అధికార యంత్రాంగం అప్రమత్తం
  • సమన్వయంతో పనిచేయాలని అన్ని శాఖలకు ఆదేశాలు
  • వర్షాలపై ముందస్తు చర్యలు.. ప్రత్యేక బృందాల మోహరింపు
  • నీటిమునిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి.. అధికారులకు సీఎం సూచనలు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్ శాఖ, హైడ్రా, విద్యుత్ శాఖ, వాటర్ బోర్డు సహా అన్ని సంబంధిత విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు.

సీనియర్ అధికారులతో సమీక్ష..

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కోర్ అర్బన్ రీజియన్ ప్రత్యేక కార్యదర్శితో పాటు ఉన్నతాధికారులు యుద్ధ ప్రాతిపదికన పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వర్షాల కారణంగా నగరవాసులు ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, వరద ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తే జంక్షన్ల వద్ద ప్రత్యేక బృందాలను మోహరించాలని సూచించారు.

ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు

వాతావరణ శాఖ హెచ్చరికలను నిరంతరం పరిశీలిస్తూ పరిస్థితులకు అనుగుణంగా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.