DK Aruna | పాలమూరు ప్రాజెక్టులపై రేవంత్‌కు చిత్తశుద్ధి లేదు

DK Aruna | పాలమూరు ప్రాజెక్టులపై రేవంత్‌కు చిత్తశుద్ధి లేదు

DK Aruna | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : పాలమూరు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో విమర్శించారు. పాలమూరు ప్రాంత ప్రాజెక్టుల కోసం రేవంత్ రెడ్డి ఎన్నడూ పోరాడలేదని ఆరోపించారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన విధానాలనే ప్రస్తుతం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని డీకే అరుణ అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కంటే ప్రచార ఆర్భాటాలపైనే సీఎం దృష్టి కేంద్రీకృతమైందని విమర్శించారు. ఇదే ధోరణి కొనసాగితే కేసీఆర్‌కు పట్టిన రాజకీయ గతే రేవంత్‌కూ పడుతుందని హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సహా కీలక సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేకపోయిందని ప్రశ్నించారు. అభివృద్ధి పనులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతోందన్న కాంగ్రెస్ ఆరోపణలను డీకే అరుణ ఖండించారు. రాష్ట్ర విభజన సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశాన్ని చట్టంలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని తెలంగాణ పొలిమేర కూడా దాటనివ్వబోమన్న సీఎం వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ‘‘తెలంగాణ ఏమైనా రేవంత్‌రెడ్డి జాగీరా? ఎవరిని ఎక్కడికి రానివ్వాలన్నది ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి నిర్ణయించే విషయం కాదు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ప్రజల మధ్యకు వెళ్లే ధైర్యం లేకే రేవంత్‌రెడ్డి భారీ భద్రతా వలయంలో తిరుగుతున్నారని అరుణ విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గమనిస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు. అదే సమయంలో బీజేపీకి ప్రజల ఆదరణ క్రమంగా పెరుగుతోందని, భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply