అపోహలు వీడి రక్తదానం చేయాలి..
అపోహలు వీడి రక్తదానం చేయాలి..
ప్రపంచ రక్తదానదినోత్సవం సంరద్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్
పటమట, ఆంధ్రప్రభ : రక్తదానంపై ఉన్న అపోహలను వీడి, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. శనివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఆయుష్ హస్పటల్‌లో ‘ప్రపంచ రక్తదాన దినోత్సవం’ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ముఖ్యఅతిధిగా హజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ రక్తదానం చేసే వారికి స్ఫూర్తిని కలిగించడానికి ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు.

రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేసినట్లేనని అన్నారు. దాతల నుంచి స్వీకరించిన రక్తాన్ని నాలుగు రకాలుగా విభజించి పలువురు రోగులకు ఆ రక్తాన్ని అందించి వారికి ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చునని, ఆ స్థాయికి సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణాలను కాపాడమే కాకుండా రక్తదానం చేసిన వారు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. రక్తదానం చేసిన వారిలో కొత్త రక్తకణాలు వృద్థి చెందుతాయని తెలిపారు. రక్తదానం చేసే వారందరూ ఒక సంఘంగా ఏర్పడి రక్తం అవసరమైన వారికి అందచేయడం అభినందనీయమన్నారు.
రక్తదానం చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారని, ఇంకా చాలా మంది రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని చెప్పారు. రక్త దానం చేస్తే కొత్త రక్తకణాలు వృద్థి చెందుతాయనే విషయాన్ని విస్త్రతంగా ప్రచారం చేయాలన్నారు. ఒక వ్యక్తి ఆరు నెలలకు ఒక సారి రక్తదానం చేయవచ్చునని నిపుణుల తెలియజేస్తున్నారని చెప్పారు. రక్తదాన శిబిరాలను ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉందని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కోరారు. డాక్టర్ వై.రమేష్ మాట్లాడుతూ రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఒక మనిషి చేసిన రక్తదానం వల్ల రక్తంలో నుంచి కాంపోనెట్స్‌ను వేరు చేసి మరికొంత మందికి అందింవచ్చునని చెప్పారు.
తమ ఆసుపత్రిలో ప్రత్యేకంగా బ్లడ్‌బ్యాంక్ ఉందని, రోగులకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. డాక్టర్ పద్మ మాట్లాడుతూ ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒకరు రక్తదానం చేస్తే నలుగురిని కాపాడవచ్చునని చెప్పారు. డాక్టర్ కే.గోపాలకృష్ణ మాట్లాడుతూ రక్తదానంపై ప్రజల్లో అవగాహన కోసం ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తమ ఆసుపత్రిలో యాక్సిడెంట్ అయిన ఒక రోగికి చికిత్స సమయంలో 27 సీసాల రక్తాన్ని అందించి కాపాడమన్నారు.
2012 సంవత్సరం నుంచే ఆయుష్ ఆసుపత్రిలో బ్లడ్‌బ్యాంక్‌తో పాటుగా కాంపోనెంట్ బ్యాంక్‌ను కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పి.పద్మ, ఎం.జయలక్ష్మి, కేఎల్‌వీ.ప్రసాద్, గద్దె రమేష్, పేరేపి ఈశ్వర్, యలమంచిలి పండు, వంగల కృష్ణ ప్రసాద్, యలమందరావు, గుళ్ళపల్లి శంకర్, గుత్తికొండ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
