ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పాలన…

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పాలన…

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
కనిమెర్లతండాలో హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన.
పోరాట నగర్లో పశువుల హాస్టల్ ప్రారంభం.

మైలవరం, ఆంధ్రప్రభ : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పాలన ఉందని, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. మైలవరం మండలంలోని కనిమెర్లతండాలో రూ.36లక్షల 15వ ఆర్థికసంఘం నిధులతో గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనం (హెల్త్ సెంటర్) నిర్మాణానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మంగళవారం శంకుస్థాపన చేశారు.

పోరాట నగర్లో రూ.10 లక్షల ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో నిర్మించిన పశువుల వసతి శాలను (పశువుల హాస్టల్) కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ పల్లెల్లో ఆరోగ్య కేంద్రాల నిర్మాణంతో వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజారోగ్య సంరక్షణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మైలవరం నియోజకవర్గంలో రూ.9.35 కోట్లతో 29 హెల్త్ సెంటర్ల నిర్మాణాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో భవనం పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు పశువుల హాస్టళ్లకు బీజం వేశారన్నారు. మూగజీవుల కోసం మేత, తాగునీరు, షెడ్లు వంటి ఇతర ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సన్న, చిన్నకారు, పశు పోషకుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ పశుపోషకుల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తోందని అభినందించారు.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పాలఉత్పత్తి లేదన్నారు. పాలు నిత్యావసర వస్తువుగా మారిందన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందితేనే అందరికీ నాణ్యతతో కూడిన పాలు లభిస్తాయన్నారు. ఇందుకోసం పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రభుత్వం పలు రాయితీలను కల్పిస్తుందన్నారు. ప్రభుత్వం, యూనియన్ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకుని పాడి పశువులను వృద్ధి చేసుకుని నాణ్యమైన పాల దిగుబడి సాధించాలన్నారు.

తద్వారా జీవనోపాధి పొందాలని సూచించారు. స్వర్ణాంధ్ర-స్వచ్చంధ్ర కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరణ రిక్షాను ప్రారంభించారు. వెదురుబీడెం గ్రామంలో టీడీపీ కుటుంబ సభ్యుడు కొలుసు రంగారావు ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారికి ఆయా గ్రామాల్లో ఘనస్వాగతం లభించింది. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.