వరద ప్రవాహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశం

కడెం, ఆంధ్రప్రభ : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టులో నీటి నిల్వ పెరగడంతో వరద ప్రవాహం అధికమైంది. ఈ విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గురువారం భారీ వర్షంలోనే ప్రాజెక్టు వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితిని అధికారులతో కలిసి సమీక్షించిన ఎమ్మెల్యే, లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.

భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

అన్ని శాఖల అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, నిర్మల్ డీఆర్‌డీఓ విజయలక్ష్మి, కడెం ప్రాజెక్టు ఈఈ ప్రవీణ్ కుమార్, మండల తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్, ఎంపీడీఓ అరుణ, పెద్దూర్–కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.